పాకిస్థాన్‌లో 9 రోజుల పాటు హోలీ సంబరాలు.. అక్కడ ఆ ఆలయంలో హోలికా దహన్‌..

రంగుల పండుగ హోలీని మార్చి 25 వ తేదీన అత్యంత వైభవంగా జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి.

Update: 2024-03-20 08:07 GMT

దిశ, ఫీచర్స్ : రంగుల పండుగ హోలీని మార్చి 25 వ తేదీన అత్యంత వైభవంగా జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది హిందూ మతస్తులు జరుపుకునే ప్రధాన పండగలలో ఒకటి. అయితే అన్ని పండగల లాగానే హోలీ వెనుక కూడా ఒక పురాణ కథ ఉంది. ఇది ప్రహ్లాదుడు, హోలికల కథ. ఈ కథనాన్ని అనుసరించి హోలీకి ముందు రోజు హోలికా దహనం చేస్తారు. భారతదేశంలోనే కాదు పాకిస్థాన్‌లోని ఓ దేవాలయంలో కూడా హోలికా దహన్‌ను రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. హోలీ సందర్భంగా హోలికా దహన్ పౌరాణిక కథతో సంబంధం ఉన్న పాకిస్తాన్ ఆలయం గురించి తెలుసుకుందాం.

ప్రహ్లాదపురి దేవాలయం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ముల్తాన్ నగరంలో ఉంది. ఈ ఆలయం ఒకప్పుడు ముల్తాన్ చారిత్రక స్మారక చిహ్నం. హిందూ మతంలో కూడా దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. విష్ణువు నరసింహ అవతారాన్ని పురస్కరించుకుని వేల సంవత్సరాల క్రితం భక్తుడైన ప్రహ్లాదుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని నమ్ముతారు. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి, హోలికా దహన్ కథను తెలుసుకోవడం ముఖ్యం.

హోలిక, ప్రహ్లాదుల కథ ?

పురాణాల ప్రకారం హిరణ్యకశ్యపుడు రాక్షసుల రాజు. అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడు విష్ణువును తన శత్రువుగా భావించాడు. అందుకే ప్రహ్లాదుని భగవంతుడిని ఆరాధించకుండా ఆపడానికి ప్రయత్నించాడు. ఇది పని చేయకపోవడంతో అతను తన సోదరి హోలికను సహాయం కోరాడు. హోలికను అగ్ని కాల్చదనే ఉంటుంది. అప్పుడు హోలిక ప్రహ్లాదుని ఒడిలోకి తీసుకుని మండుతున్న మంటల్లో కూర్చుంది. కానీ విష్ణువు దయతో ఈ కుట్రలో హోలిక బూడిదైంది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ కథ చెడు పై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు.

ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడడంతో హిరణ్యకశ్యపునికి మరింత కోపం వచ్చింది. కోపంతో అతను బాల ప్రహ్లాదుని స్తంభానికి కట్టి చంపడానికి కత్తిని తీసుకున్నాడు. అప్పుడు విష్ణువు అవతారమైన నరసింహుడు ఆ స్తంభం పై ప్రత్యక్షమై హిరణ్యకశ్యపుని సంహరించాడు.

ముల్తాన్ ఆలయం..

ముల్తాన్ ఆలయం గురించి చెప్పుకుంటే హోలిక అగ్నిలో కాలిపోయింది ఇక్కడే. అలాగే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఒక స్తంభానికి కట్టివేయగా స్తంభం నుంచి నరసింహస్వామి ప్రత్యక్షమై రాక్షసున్ని చంపింది అక్కడే.

1947లో దేశ విభజన సమయంలో ప్రహ్లాద్‌పురి ఆలయం పాకిస్థాన్‌లో భాగమైంది. హోలీ సందర్భంగా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది. రెండు రోజుల పాటు హోలీకా దహన్ నిర్వహించగా 9 రోజుల పాటు హోలీ జాతర కొనసాగేది. అయితే 1992లో అయోధ్య - బాబ్రీ మసీదు వివాదం తర్వాత కొందరు ఛాందసవాదులు ఆలయాన్ని కూల్చివేశారు. అప్పటి నుంచి ప్రభుత్వం కూడా వీటి సంరక్షణ పై పెద్దగా దృష్టి పెట్టలేదు. కొన్నేళ్ల క్రితం ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని పాకిస్థాన్ కోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News