మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్య

తనకున్న కొంత భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని పంటలు సాగు చేయగా, దిగుబడి రాక మనస్తాపానికి గురై కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జమ్మికుంట మండలం పాపక్కపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

Update: 2023-06-02 15:54 GMT

జమ్మికుంట మండలం పాపక్కపల్లి గ్రామంలో ఘటన 

దిశ, జమ్మికుంట : తనకున్న కొంత భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని పంటలు సాగు చేయగా, దిగుబడి రాక మనస్తాపానికి గురై కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జమ్మికుంట మండలం పాపక్కపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. పాపక్కపల్లి గ్రామానికి చెందిన కదురాల శ్రీనివాస్ (47) కు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీంతో పాటు ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన కటంగూరి నరేందర్ రెడ్డికి చెందిన ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని ఆరేళ్లుగా కౌలుకు తీసుకొని వరి, పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేసేవాడు.

ఈ క్రమంలోనే పంట దిగుబడి సరిగా రాకపోవడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ గురువారం వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. అనంతరం తన భార్య స్రవంతికి ఫోన్ ద్వారా సమాచారం అందజేశాడు. కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది గ్రామస్థులతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని శ్రీనివాస్ ను జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కరీంనగర్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే శ్రీనివాస్ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు కూతురు, కుమారుడు ఉన్నారు.

Tags:    

Similar News