జనగామ కలెక్టరేట్ లో పెట్రోల్ పోసుకొని దంపతుల ఆత్మహత్యాయత్నం..

రెవెన్యూ అధికారులు తమ భూమిని ఇతరులకు పట్టా చేశారని, తిరిగి తమ భూమి తమకు పట్టం చేసి ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పురోగతి లేకపోవడంతో విసుగు చెందిన దంపతులిద్దరూ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నానికి పూనుకున్న ఘటన జనగామ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం చోటు చేసుకుంది.

Update: 2023-02-13 14:10 GMT

దిశ, జనగామ: రెవెన్యూ అధికారులు తమ భూమిని ఇతరులకు పట్టా చేశారని, తిరిగి తమ భూమి తమకు పట్టం చేసి ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పురోగతి లేకపోవడంతో విసుగు చెందిన దంపతులిద్దరూ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నానికి పూనుకున్న ఘటన జనగామ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సోమవారం కావడంతో కలెక్టరేట్ లో గ్రీవెన్స్ కొనసాగుతుంది. కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, వివిధ విభాగాల అధికారులకు వినతులను ఇచ్చే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో జనగామ మండలం పసలమట్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు, రజిత దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోబోయారు.

పోలీస్ సిబ్బంది నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ మాటల్లో పెట్టి చాకచక్యంగా వారిని కాపాడారు. కలెక్టరేట్ భవనం పోర్టు కోవాపై దంపతులిద్దరూ పోలీసులతో పెనుగులాడుతున్నప్పటికీ, పోలీస్ సిబ్బంది వారిని కాపాడి సురక్షితంగా కిందికి దించారు. అనంతరం వాటర్ పైప్ తో వారిని కడిగి జనగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఒక తహసీల్దార్ నిమ్మల నర్సింగరావుకు చెందిన 6 ఎకరాల భూమిని వారి దయాదులకు అక్రమంగా పట్టా మార్పిడి చేశారని వారు వాపోయారు. ఈ విషయమై ఆరు నెలల క్రితం కూడా నర్సింగరావు ఇదే కలెక్టరేట్ భవనంపై ఎక్కి ఆత్మహత్యలకు పూనుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఆ సమయంలో కలెక్టర్ శివలింగయ్య బాధితుడితో మాట్లాడి ఈ సమస్యను కోర్టు ద్వారా తేల్చుకోవాలని సూచించాడు. దీంతో నిరుత్సాహపడిన సదర్ యువకుడు కలెక్టరేట్ భవనం పైకి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. అయితే సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం తిరిగి భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పూనుకోవడం సంచలనంగా మారింది. మరి ఈ సారైనా అధికారులు స్పందించి వారి భూ సమస్యకు పరిష్కారం చూపి న్యాయం చేస్తారో, లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News