గైడ్ లేదు.. లైన్స్ లేవు.. అంతా అయోమయం

దిశ, ప్రత్యేక ప్రతినిధి: కటాఫ్​డేట్​లేదు.. బేస్​లైన్​లేదు.. గైడ్​లేదు.. లైన్స్ లేవు. ఏది నిర్థిష్టంగా లేకుండానే పోడు భూముల దరఖాస్తు పర్వానికి అధికారులు సిద్ధమయ్యారు. దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.. ఎవరు కాదు అనే విషయాన్ని ప్రభుత్వ అధికారులు ఇంత వరకూ ప్రజలకు వివరించలేదు. గిరిజన శాఖ గైడ్ లైన్స్​రూపొందించలేదు. జిల్లా కలెక్టర్లకు నిర్థిష్టమైన సూచనలందలేదు. అసలు అటవీ శాఖకు మార్గదర్శకాలపై కనీస సమాచారం లేదు. కార్యక్రమాన్ని అమలు చేసే నోడల్​ఏజెన్సీ గిరిజన శాఖనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను […]

Update: 2021-11-06 22:43 GMT

దిశ, ప్రత్యేక ప్రతినిధి: కటాఫ్​డేట్​లేదు.. బేస్​లైన్​లేదు.. గైడ్​లేదు.. లైన్స్ లేవు. ఏది నిర్థిష్టంగా లేకుండానే పోడు భూముల దరఖాస్తు పర్వానికి అధికారులు సిద్ధమయ్యారు. దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.. ఎవరు కాదు అనే విషయాన్ని ప్రభుత్వ అధికారులు ఇంత వరకూ ప్రజలకు వివరించలేదు. గిరిజన శాఖ గైడ్ లైన్స్​రూపొందించలేదు. జిల్లా కలెక్టర్లకు నిర్థిష్టమైన సూచనలందలేదు. అసలు అటవీ శాఖకు మార్గదర్శకాలపై కనీస సమాచారం లేదు. కార్యక్రమాన్ని అమలు చేసే నోడల్​ఏజెన్సీ గిరిజన శాఖనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఎలా ప్రారంభించాలన్న అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నది. ఈ క్రమంలో అసలు సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ సాధ్యమేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ది షెడ్యూల్డ్​ట్రైబ్స్​అండ్​అదర్​ఫారెస్ట్​ట్రెడిషనల్​డ్వెల్లర్స్​రికగ్నిషన్​ఆఫ్ ఫారెస్ట్​రైట్స్​యాక్ట్​‌‌2006(షెడ్యూల్​తెగల, ఇతర సంప్రదాయ అటవీ నివాసితుల అటవీ హక్కుల గుర్తింపు చట్టం) ప్రకారం అటవీ భూములపై హక్కు పత్రాలను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రితోపాటు చీఫ్ సెక్రెటరీ పలు సార్లు సమావేశమై పలు సూచనలు చేశారు. గిరిజనులకు న్యాయం చేయాలి, అడవులను రక్షించాలని రెండు విధాలుగా సీఎం ఆదేశాలిచ్చారు. కానీ,.. ఆర్​ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం 2005 డిసెంబర్​13నాటికి అటవీభూమిని సాగు చేసుకుంటున్న షెడ్యూల్​తెగలకు, మూడు తరాలుగా అడవి భూమిని నమ్మకుని ఉన్న ఇతర సంప్రదాయ నివాసితులు పోడు భూముల యాజమాన్య హక్కులను పొందడానికి అర్హులనే విషయాన్ని మూడు శాఖల అధికారులు ఇప్పటి వరకూ బహిరంగ ప్రకటన చేయలేదు. మార్గదర్శకాలు రూపొందించండి.. దరఖాస్తులు తీసుకోండి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకూ అడుగు ముందుకు పడలేదు. కొత్తగా ఆర్ఓఎఫ్ఆర్​కమిటీలు వేసిందీ లేదు. మరి ఎలా ముందుకు అనేది ఇప్పుడు అధికారులకు పెద్ద సవాల్ గా మారింది. రాష్ట్రంలో పోడు భూముల పట్టాల జారీకి విధి విధానాల రూపకల్పనపై ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వచ్చే నెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. కానీ.. దరఖాస్తుల ప్రాసెస్​ఎలా అనే విషయంపై మూడు శాఖల మధ్య సమన్వయం లేదు. అసలు ఏ శాఖకు ఇప్పటి వరకు స్పష్టమైన అవగాహన లేదనడంలో సందేహం లేదు.

అటవీ ప్రాంతాలలో పోడుభూములకు పట్టాలు ఎవరికి ఇవ్వాలి..? ఎవరు అసలు అర్హులు..? ఏ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి..? అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది. రికగ్నిషన్​ఆఫ్​ఫారెస్ట్​రైట్స్​(ఆర్ఓఎఫ్ఆర్)​పట్టాల కోసం లక్షలాది మంది వేచి చూస్తున్న తరుణంలో సర్కార్​ఎలాంటి విధానాన్ని అవలంభిస్తుంది..? ఆర్ఓఎఫ్ఆర్​చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తుందా..? స్థానిక రాజకీయ ఒత్తిడులకు లొంగి ఉదారంగా వ్యవహరిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆ దరఖాస్తుదారులు అసలు 2005 కంటే ముందు కబ్జాలో ఉన్నారా… ఆ తర్వాత పట్టాలొస్తాయని ఆశ పడి కబ్జా చేశారా..? పట్టాల కోసం పథకం ప్రకారం అడవులను ధ్వంసం చేశారా..? అనే కోణంలో అటవీశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే శాటిలైట్ మ్యాపులను సిద్ధం చేశారు. కానీ.. ఉపగ్రహ చిత్రాలను సర్కార్​ఇప్పటి వరకు పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు లేవు. అసలు బేస్​లైన్​ను ముందుగా ప్రకటించకపోతే లక్షలాది మంది అడవి భూములు మావేనంటూ దరఖాస్తు చేసుకునే ప్రమాదముందని అటవీశాఖ ఆందోళన చెందుతున్నది.

తాజాగా డిజిటల్​సర్వే నిర్వహించి స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందా అనేది ప్రశ్నగా మారింది. వాస్తవానికి ఆరు లక్షల ఎకరాల అటవీ భూములలో పోడు పేరిట ఆక్రమణ జరిగిందని, అసలైన అర్హులను ఉపగ్రహచిత్రాల ఆధారంగా గుర్తించి మాత్రమే పట్టాలివ్వాలని అటవీశాఖ ప్రతిపాదించింది. కానీ.. గిరిజనశాఖ, రెవెన్యూ శాఖ దీనిని లైట్​గా తీసుకుంది. దాదాపు 8లక్షల ఎకరాలకు పైగా పోడు భూములు గిరిజన తెగల ఆధీనంలో ఉన్నాయని, వారు తరతరాలుగా సాగు చేసుకుని బతుకుతున్నారని గిరిజన సంక్షేమ శాఖ వాదిస్తున్నది. ఈ మేరకు అటవీ, గిరిజన శాఖ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో పోడు భూముల సమస్యాత్మక ప్రాంతాలలో ప్రాథమిక సర్వే జరిపించారు. ఉన్నతాధికారులు మూడు రోజులపాటు అటవీ ప్రాంతాలలో పర్యటించి అసలు సమస్యకు మూలం కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు. కానీ.. ఏ విధానాన్ని అవలంభించాలన్న దానిపై ఇంకా స్పష్టమైన సూచనలు ఇవ్వలేదు. ఇప్పటికే గిరిజన శాఖతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు దరఖాస్తులను తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల నేతృత్వంలో దరఖాస్తులను అధికారులు స్వీకరించనున్నారు. దరఖాస్తులను తీసుకున్న తర్వాత అటవీ ప్రాంతాల వారీగా డిజిటల్​సర్వేను నిర్వహించాలని సర్కార్​నిర్ణయించింది. గ్లోబల్​ పొజిషనింగ్​సిస్టమ్​ద్వారా నిర్వహించే ఈ డిజిటల్​సర్వేలో అటవీ భూముల కబ్జాలో ఉన్నవారు ఎంత కాలం నుంచి సాగు చేసుకుంటున్నారనే విషయంపై దృష్టి సారిస్తారని అంటున్నారు.

Tags:    

Similar News