భయం వద్దు.. ఇంట్లోంచి కదలకండి: సీఎం కేసీఆర్

దిశ, న్యూస్ బ్యూరో:  కరోనా భయంకర రాక్షసి అయినా దాన్ని ఎదుర్కోడానికి ప్రభుత్వం అన్ని వైపులా సర్వ సన్నద్ధంగా ఉందనీ, తగిన ఏర్పాట్లు చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కల్పించారు. ఈ జబ్బుకు ఇప్పటివరకూ మందు లేదనీ, ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉంటే అది అత్యుత్తమమైన ఔషధమని అన్నారు. నిత్యావసరాల కోసం ప్రజలు క్రమశిక్షణ తప్పి గుంపులు గుంపులుగా బయటకు రావద్దనీ, ప్రజా ప్రతినిధులు సైతం మందీ మార్బలంతో తిరగవద్దని సూచించారు. 11 వేల ఐసొలేషన్ బెడ్‌లు, […]

Update: 2020-03-27 09:10 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా భయంకర రాక్షసి అయినా దాన్ని ఎదుర్కోడానికి ప్రభుత్వం అన్ని వైపులా సర్వ సన్నద్ధంగా ఉందనీ, తగిన ఏర్పాట్లు చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కల్పించారు. ఈ జబ్బుకు ఇప్పటివరకూ మందు లేదనీ, ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉంటే అది అత్యుత్తమమైన ఔషధమని అన్నారు. నిత్యావసరాల కోసం ప్రజలు క్రమశిక్షణ తప్పి గుంపులు గుంపులుగా బయటకు రావద్దనీ, ప్రజా ప్రతినిధులు సైతం మందీ మార్బలంతో తిరగవద్దని సూచించారు. 11 వేల ఐసొలేషన్ బెడ్‌లు, 1400 ఐసీయూ బెడ్‌లతో గచ్చిబౌలి స్టేడియం ఒక ఆస్పత్రిగా తయారవుతోందనీ, ఇక గాంధీ, కింగ్ కోఠి ఆసుపత్రులు పూర్తిగా కరోనా కోసమే వాడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్నవెంటిలేటర్లకు తోడు కొత్తగా 500 సమీకరించుకుంటున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్ కొనసాగుతున్నా ఎవ్వరికీ పస్తులుండే పరిస్థితులు రానివ్వబోమనీ, రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరి కడుపు నింపుతామని హామీ ఇచ్చారు. పంటలను ఎండనివ్వబోమని, పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొని రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని హామీ ఇచ్చారు. కరోనా కట్టడిపై అధికారులతో సుదీర్ఘ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఈ వివరాలను వెల్లడించారు.

ఒక్క రోజే 14 పాజిటివ్ కేసులు ..

రాష్ట్రంలో ఇప్పటికే 45 మంది కరోనా పాజిటివ్ కేసులు ఉండగా శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం సంఖ్య 59కు చేరుకుంది. ఇందులో ఒకరు డిశ్చార్జి కాగా ఇంకా 58 మంది ట్రీట్‌మెంట్‌లో ఉన్నారు. ఇంకా సుమారు 20 వేల మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రజల నుంచి సహకారం లభించినందువల్ల పాజిటివ్ కేసుల సంఖ్య నియంత్రణలో ఉందనీ, లేకుంటే పెద్ద విస్ఫోటనం జరిగి ఉండేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇప్పటికీ కరోనా రోగానికి మందు లేదు కాబట్టి స్వీయ నియంత్రణ పాటిస్తూ ఒకరి నుంచి మరొకరికి అంటించకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. ఉన్నతాధికారులతో రెండ్రోజుల పాటు సమీక్ష నిర్వహించిన సీఎం తక్షణం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, ఇకపైన తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. విదేశాల నుంచి ఈ మహమ్మారి రావడం ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఒకరి నుంచి మరొకరికి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమైన పని అని అన్నారు. ఇందుకు ప్రజల సహకారమే కీలకమైనదని చెప్పారు. భయంకరమైన కరోనాతో యుద్ధం చేస్తున్నామనీ, ఒకప్పుడు పాతబస్తీకి మాత్రమే పరిమితమైన కర్ఫ్యూ లాంటి సన్నివేశాలు ఇప్పుడు దేశమంతటా, ప్రపంచమంతటా చూస్తున్నామని, దీన్నిబట్టి కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చనని సీఎం వ్యాఖ్యానించారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన, సంపన్న దేశంలోనే న్యూయార్క్ లాంటి నగరంలో పరిస్థితి చేయి దాటిపోతూ ఉన్నదని, కేవలం 11 వేల వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో కనీసంగా 30 వేల వెంటిలేటర్లు అవసరమని, దాంతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి ఎంత అదుపులో ఉందో ఊహించుకోవచ్చునని అన్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందించి ప్రజలు స్వీయ నియంత్రణతో ఉంటూ రోడ్లమీదకు రాకుండా ఉన్నారని చెప్పారు. అయితే, ఇది ఆశించిన తీరులో లేదన్నారు. ఇంకా చాలా స్వయం క్రమశిక్షణ పాటించాల్సి ఉన్నదన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 190 వెంటిలేటర్లు..

ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో 190 వెంటిలేటర్లు ఉన్నాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇచ్చిన వివరాలను ప్రస్తావిస్తూ కొత్తగా 500 వెంటిలేటర్ల కోసం ఆర్డర్ ఇచ్చామని, కొన్ని ఇప్పటికే చేరుకున్నాయని, ఇంకొన్ని త్వరలో వస్తాయని సీఎం వివరించారు. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు పూర్తిస్థాయిలో సహకరిస్తే ఇది ఎంత భయంకరమైన వ్యాధి అయినా తెలంగాణ ఎదుర్కోగలుగుతుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం దేశంలో సుమారు 20 కోట్ల మంది కరోనా సమస్యలు ఎదుర్కొంటారని తెలిసిందనీ, కాబట్టి ‘ఏమవుతుందిలే’ అనే నిర్లక్ష్యం పనికిరాదని, ప్రజలు జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇండ్లకే పరిమితం కావాలని కోరారు. ప్రపంచమే భయపడుతోందనీ, దీని వ్యాప్తిని నిరోధించడమే ఏకైక ఔషధమని అన్నారు.అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, ప్రభుత్వం ధైర్యం కోల్పోలేదని, ఎదుర్కోడానికి వంద శాతం సిద్ధంగా ఉందని, ప్రధాని కూడా అన్ని రకాలుగా సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని సీఎం తెలిపారు.

కరోనాతో బాధితుల్లో 80.9 % బతికే ఛాన్స్..

కరోనాతో ఎఫెక్ట్ అయ్యేవారిలో 80.9% స్వల్ప లక్షణాలతో ప్రభావితులవుతారనీ, వారికి బతికే ఛాన్స్ ఉంటుందన్నారు. కేవలం 13.8% మంది పేషెంట్లలో మాత్రం లక్షణాలు తీవ్రంగా ఉంటాయని, వీరికి కాస్త అనారోగ్య ప్రమాదం ఉంటుందన్నారు. ఇక మిగిలిన 4.7% మంది పేషెంట్లు మాత్రం తీవ్రంగా అనారోగ్యం
పాలవుతారని, వారిని ఐసీయూలో పెట్టాల్సి ఉంటుందని, సకాలంలో ఆక్సిజన్, వెంటిలేటర్ లాంటి సౌకర్యాలు అందించాల్సి ఉంటుందన్నారు. అందువల్ల స్వల్ప స్థాయిలో ఎఫెక్ట్ అయ్యే 80.9% వ్యాధిగ్రస్తులను ఇంటి దగ్గరే క్వారంటైన్‌లో ఉంటున్నారని తెలిపారు. మిగిలిన రెండు విభాగాలవారు ఆస్పత్రుల్లోచికిత్స పొందుతున్నారనీ, ఐసొలేషన్ వార్డుల్లో వైద్య పర్యవేక్షణలో ఉంచాల్సి వస్తోందన్నారు. కరోనాను ఎదుర్కోడానికి తెలంగాణ ప్రభుత్వ సన్నదద్ధతపై రెండ్రోజుల పాటు వివిధ శాఖల అధికారులు, వైద్య నిపుణులతో చర్చించామనీ, లోతుగా అధ్యయనం చేశామని, మనకు మనమే ఎవరిపైనా ఆధారపడకుండా మనకున్న వనరులతో ఎదుర్కోడానికి ఏం చేయాలో ఆలోచించామని తెలిపారు. 100 మంది నర్సులు అవసరమైన చోట 130 మందిని సిద్ధంగా ఉంచుకుంటున్నామని తెలిపారు. పారామెడికల్, టెక్నీషియన్లు, భోజనం, వసతి, వైద్య పరికరాలు, వాహనాలు.. ఇలా అన్ని వైపుల నుంచి దశలవారీగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

రిటైర్డ్ సిబ్బంది సేవల్ని వినియోగించుకుంటాం

ఒక్కో దశలో 4 వేల మందిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచేలాగ 11 వేల మందికి సిద్ధంగా వార్డులు ఉన్నట్లు తెలిపారు. క్రిటికల్ కేర్ కోసం సుమారు 1400 ఐసీయూ బెడ్స్‌ని కూడా రెడీగా పెట్టుకున్నట్లు తెలిపారు. 80% మంది అనుకునే పేషెంట్లలో మైల్డ్‌గా లక్షణాలు కనిపించినా ఆ లెక్క ప్రకారం సుమారు 60 వేల మందికి ఈ ఎఫెక్ట్ సోకినా సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

రంగంలోకి రిటైరన వారూ.. ప్రస్తుతం సర్వీసులో ఉన్న వైద్యులు, నర్సులు, పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర వైద్య సిబ్బందికి తోడు రిటైర్ అయిన 11 వేల మంది డాక్టర్లనూ ఇప్పుడు రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం జాబితా తయారవుతోందనీ, దీనికి తోడు పీజీ చేస్తున్న మెడికోల లిస్టు కూడా రెడీ అవుతోందన్నారు. ఇక ల్యాబ్ టెక్నీషియన్ల జాబితా కూడా తయారు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 8 వేల మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లోపనిచేస్తున్నారని, ఇంకా అదనంగా కూడా సమకూర్చుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. పీజీ కోర్సుల్లో ఉన్న 3 వేల మంది కూడా వస్తారని తెలిపారు. పూర్తిస్థాయిలో వ్యాధి విజృంభించినా ఎదుర్కోడానికి ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు మాత్రం అలసత్వం వీడాలనీ, నిర్లక్ష్యం అస్సలే పనికిరాదన్నారు. భయంకరమైన విపత్తులో ఉన్నామని, భయంకర రాక్షసితో యుద్దం చేస్తున్నామని ప్రజలు గుర్తించాలన్నారు. కొన్ని బాధలను కొంతకాలం పాటు ప్రజలు భరించక తప్పదన్నారు. ప్రభుత్వ, పోలీసు, వైద్య సిబ్బందికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకారం ఇవ్వాలనీ, వారిని నియంత్రించడానికి పోలీసులు శక్తిని, సమయాన్ని వెచ్చించాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ప్రజలే ఆలోచనతో, వివేచనతో మెలగాలని పిలుపునిచ్చారు. కరోనా అంశం ఇక్కడితోనే ఆగిపోదనీ, ముందుముందు చాలా సవాళ్లు వస్తాయని, ప్రజలు సహకారం ఇస్తేనే అలాంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం సాధ్యమవుతుందన్నారు. కరోనాతో యుద్ధాన్ని చేస్తూనే పేదల కడుపు నింపడం, కూరగాయలు, పాలు తదితర నిత్యావసర వస్తువుల రవాణా వ్యవహారాన్ని కూడా ప్రభుత్వం చూడాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో ఉన్న ఏ రాష్ట్రానికి చెందినవారైనా వారి పొట్టలు నింపుతామని, హాస్టళ్లు మూతపడవనీ, ఒక్కరు కూడా ఉపవాసం ఉండాల్సినపని లేనని, తగిన వసతి కల్పిస్తామని, ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని కోరారు.

ప్రతి గింజనూ కొంటాం..

రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పంటలు రెడీగా ఉన్నాయనీ, చివరి స్టేజ్‌లో ఉన్న పంటలు త్వరలో కోతకు వస్తాయని, అందువల్ల వచ్చే నెల 10వ తేదీ వరకు ఎస్సారెస్పీ, కాళేశ్వరం, నాగార్జునసాగర్, జూరాల ఆయకట్టు కింద పొలాలకు నీటి సరఫరా జరగాలని సంబంధిత అధికారులను కేసీఆర్ ఆదేశించారు. చివరి ఎకరం వరకూ పండాలని, కల్వకుర్తి, దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా కూడా నీళ్లు అందుతాయని అన్నారు. అధికారులతో, రైతులతో, ఎమ్మెల్యేలతో, రైతుబంధు సమన్వయ సమితి సభ్యులతో వారిలో వారు సమన్వయించుకోవాలని కోరారు. బోరుబావులపై ఆధారపడేవారికి విద్యుత్ సరఫరా నిరాటంకంగా జరిగేలా విద్యుత్ శాఖ ఉద్యోగులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకో 15 రోజుల పాటు 24 గంటల విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. పంటలు చేతికొచ్చిన తర్వాత 3 వేల మెగావాట్ల వినియోగం తగ్గిపోతుందన్నారు. పంటలు చేతికొచ్చిన తర్వాత రైతులు వీటిని అమ్ముకోడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయనీ, గ్రామాల్లోనే ప్రభుత్వం కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొంటుందని, రైతులకు ఆందోళన అవసరం లేదన్నారు.

గిట్టుబాటు ధరకే కొనుగోలు..

గిట్టుబాటు ధరకే ఒక్క గింజ కూడా వదలకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. గూడ్సు, లారీలు తప్ప రోడ్లమీద వాహనాల రాకపోకలన్నీ ఆగిపోయాయని, అయినా రైతులు మానసిక వత్తిడి గురికావద్దని కోరారు. పంటలు పట్టణాలకు రావని, గ్రామాల్లోనే మార్కెటింగ్ సిబ్బంది కొంటారని, ఏప్రిల్ నెల మొత్తం కొనుగోళ్లతో బిజీగా ఉంటుందని అన్నారు. ఐకెపి సెంటర్లు, హమాలీలు, బస్తాలు, కాంటలు ఇలా అన్నింటినీ ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. రైతులెవరూ తొందరపడొద్దని, ఆలస్యంమైనా మక్కలు, వరి తదితర అన్ని పంటలనూ గిట్టుబాటు ధరకే ప్రభుత్వం కొని బ్యాంకు సొమ్మును రైతుల ఖాతాల్లోనే జమ చస్తుందన్నారు. ఇందుకోసం అవసరమయ్యే రూ. 35 వేల కోట్ల గురించి రిజర్వుబ్యాంకుతో మాట్లాడుతున్నామని తెలిపారు. వ్యసాయ, మార్కెట్, వేర్ హౌజింగ్ గోడౌన్లలో ధాన్యాన్ని నిల్వ చేస్తామని, అవసరమైతే తాత్కాలికంగా గ్రామాల్లోని పాఠశాలల్లో నిల్వ చేస్తామన్నారు. గిట్టుబాటు ధర చెల్లించేటట్లయితే వ్యాపారులు కూడా రైతుల నుంచి కొనుక్కోవచ్చన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్సులో తగిన ఆదేశాలిస్తానన్నారు. ఏ ఒక్కరూ పస్తులుండొద్దు ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘లాక్‌డౌన్’ ఏప్రిల్ 15 వరకూ ఉంటుందని, అప్పటిదాకా రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. పగటిపూట కూరగాయలకు ఇంకా రద్దీ ఉంటోందని, ప్రజలు సంయమనంతో సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. ప్రజా ప్రతినిధులు గుంపుతో వెళ్లడం మంచిది కాదన్నారు. ఈ విపత్కర సమయంలో ప్రజలు ఆకలికి గురికావద్దని, ముఖ్యంగా యాచకులు, అనాధాశ్రమాల్లో ఉన్నవారు, వృద్ధాశ్రమాల్లో ఉన్నవారు, నైట్ షెల్టర్లలో ఉండేవారు ఇబ్బంది పడొద్దన్నారు. నగరంలో భవన నిర్మాణ కార్మికులు చాలా ఎక్కువగా ఉన్నారనీ, బీహార్, యుపి, జార్ఖండ్, ఒడిషా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువ మంది అని గుర్తుచేశారు. ఇక రైసుమిల్లుల్లో హమాలీలు కూడా బీహారీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టు పనుల్లో కూడా అలాంటి వలస కార్మికులే ఉన్నారని, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా కనిపిస్తున్నారని, వారి కడుపు నింపడానికి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయన్నారు. వారికి క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాల్సిందిగా ఏజెన్సీలకు చెప్పామన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని పట్టించుకోవాలనీ, జీహెచ్‌ఎంసీతో పాటు ఫిర్జాదిగూడ, బోడుప్పల్, బడంగ్‌పేట, నిజాంపేట్, మీర్‌పేట్, బండ్లగూడ జాగీర్, జవహర్‌నగర్ తదితర చోట్ల ఎక్కువ మంది వలస కార్మికులు కేంద్రీకృతమైనందువల్ల ప్రభుత్వ విభాగాలు చొరవ తీసుకుని వారి కడుపు నింపాలని స్పష్టం చేశారు.

చికెన్, గుడ్లు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది..

చికెన్, గుడ్లు తింటే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, వీటికి తోడు ‘సి విటమిన్’ కలిగిన సంత్రాలు, బత్తాయిలు, దానిమ్మ పండ్లు కూడా ఇప్పటి పరిస్థితుల్లో చాలా ఉపయోగమన్నారు. మన రాష్ట్రంలో పండే బత్తాయిలు, సంత్రాలు, దానిమ్మపండ్లు తదితరాలను ఇతర రాష్ట్రాలకు పంపొద్దనీ, రైతుబజార్లలో పెట్టించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ, హార్టికల్చర్ శాఖలను ఆదేశించారు. చికెన్, కోడిగుడ్లు తినడం ద్వారా కరోనా వస్తుందనే అపోహలు ఉన్నాయనీ, అది శాస్త్రీయమైనది కాదని, బేఫికర్‌గా తినొచ్చన్నారు. వీటి రవాణాకు ఆటంకం లేకుండా ఉండేలా పోలీసు, రవాణా శాఖల అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, అత్యవసర సర్వీసుల కింద వీటి రవాణాకు ఎలాంటి ఆటంకం ఉందన్నారు. పశుగ్రాసం తరలించే వాహనాలకు కూడా అనుమతి ఉంటుందన్నారు.

గ్రామాల్లో కంచెలు తీసేయండి..

కరోనా వ్యాప్తి నిరోధకానికి వీలుగా గ్రామాల్లో కంచెలు పెట్టుకుని ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడం ఒకరకంగా మంచిదేననీ, దీన్ని ఆహ్వానించాల్సిందేనని, అయితే, మరో రకంగా ఇది చెడ్డదన్నారు. గ్రామాల్లో ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వీటిని తొలగించాల్సి రావడం ఆటంకంగా పరిణమిస్తోందని, దీన్ని కూడా ప్రజలు గుర్తించాలని వారి గ్రామాల ప్రజలకే చివరికి సకాలంలో సేవలందక అన్యాయం జరుగుతోందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కంచెలను తీసేయాలనీ, ఆ మేరకు ప్రజలే స్వచ్ఛందంగా క్రమశిక్షణతో ఇళ్లు కదలకుండా ఉంటే మంచిదని సూచించారు.ప్రైవేటు ల్యాబ్‌లకు ఇంకా అనుమతి ఇవ్వలేదన్నారు. కరోనా లక్షణాలున్నవారి శాంపిళ్లను ప్రస్తుతం గాంధీ ఆస్పత్రితో పాటు రాష్ట్రంలో ఐదు చోట్ల లేబొరేటరీలలో పరీక్షిస్తున్నామని, ఇంకా ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇవ్వలేదని
సీఎం తెలిపారు. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న ఐసీఎంఆర్ మన రాష్ట్రంలోని అపోలో, విజయ తదితర ఆరు ప్రైవేటు లేబొరేటరీలకు అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని, అవసరాన్ని బట్టి ఇస్తామని తెలిపారు. ప్రస్తుతానికి చేయిదాటిపోయే పరిస్థితి రాలేదని, అదే వస్తే సీసీఎంబీలో రోజుకు 800 టెస్టులు చేసే సౌకర్యం ఉన్నదని, ఆ తర్వాత ప్రైవేటు ల్యాబ్‌ల గురించి ఆలోచిస్తామన్నారు. ఇక ఐసొలేషన్ వార్డుల అవసరం కూడా తొలుత ప్రభుత్వ ఆస్పత్రులు, ఆ తర్వాత వైద్య కళాశాలలు ఉన్న ఆస్పత్రులు వాడుకుని అప్పటికీ సామర్థ్యం చాలకపోతే ప్రైవేటు ఆస్పత్రుల గురించి ఆలోచిస్తామన్నారు.

అన్ని పన్నులూ వాయిదా..

గ్రామ పంచాయతీ మొదలు కార్పొరేషన్ వరకు వివిధ రకాల పన్నులు చెల్లించడానికి ఈ నెల చివరి వరకూ గడువు ఉన్నప్పటికీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో సమయానుకూలంగా వాటిని రీషెడ్యూలు చేసే నిర్ణయాన్ని ప్రకటన ద్వారా ప్రభుత్వం తెలియజేస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం హామీ ఇచ్చారు. ఈ నెలాఖరు వరకు చెల్లించాలన్న నిబంధన ఉంటుందని, అయితే పరిస్థితులను బట్టి ప్రభుత్వమే జీవోల ద్వారా స్పష్టత ఇస్తుందని, గాభరా పడాల్సిన పని లేదని స్పష్టం చేశారు.

Tags : Telangana, Corona, CM KCR, Preparedness, Lock Down, Curfew

Tags:    

Similar News