ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగించాలి:కేసీఆర్
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడి కోసం ఇప్పుడు కొనసాగుతున్న లాక్‌డౌన్ ఏప్రిల్ 15 తర్వాత కూడా కొనసాగాలని, కనీసంగా రెండు వారాలైనా పొడిగించడం మంచిదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, ప్రధాని మోడీకి కూడా ప్రతిపాదించానని, మళ్ళీ రెండు మూడు రోజుల్లో జరిగే వీడియో కాన్ఫరెన్సులోనూ దీన్ని నొక్కిచెప్తానని అన్నారు. కరోనాకు మందే లేని పరిస్థితుల్లో దీన్ని వ్యాపించకుండా తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం సరైన మందు అని, అనేక అంతర్జాతీయ మెడికల్ […]
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడి కోసం ఇప్పుడు కొనసాగుతున్న లాక్‌డౌన్ ఏప్రిల్ 15 తర్వాత కూడా కొనసాగాలని, కనీసంగా రెండు వారాలైనా పొడిగించడం మంచిదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, ప్రధాని మోడీకి కూడా ప్రతిపాదించానని, మళ్ళీ రెండు మూడు రోజుల్లో జరిగే వీడియో కాన్ఫరెన్సులోనూ దీన్ని నొక్కిచెప్తానని అన్నారు. కరోనాకు మందే లేని పరిస్థితుల్లో దీన్ని వ్యాపించకుండా తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం సరైన మందు అని, అనేక అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్ దీన్ని ప్రశంసిస్తున్నాయని అన్నారు. ఇప్పటిదాకా తీసుకున్న చర్యల వల్ల దేశ జనాభాతో పోలిస్తే పాజిటివ్ కేసులు చాలా తక్కువగానే ఉన్నాయని, లాక్‌డౌన్ ఎత్తివేస్తే మళ్ళీ బస్సులు, రైళ్ళు, విమానాలు, వాహనాలు తిరగడం మొదలైతే ఇప్పటిదాకా తీసుకున్న చర్యలకు ఫలితం ఉండదని అన్నారు. పైగా దేనికి అనుమతి ఇవ్వాలి, దేనికి ఆంక్షలు ఉండాలి అనేదాన్ని నియంత్రించడం చాలా కష్టమైన పని అని అన్నారు. లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, పరిశ్రమలు మూతబడి కోట్లాది మంది కార్మికులకు ఉపాధి పోవడం లాంటి సమస్యలు ఉన్నా కష్టపడి వాటిని తిరిగి పునరుద్ధరించవచ్చునని, కానీ కరోనా కారణంగా జరిగే మరణాలను నిలువరించలేమని, పోయిన ప్రాణాలను తీసుకురాలేమని అన్నారు. సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో సీఎం పై వ్యాఖ్యలు చేశారు.
లాక్‌డౌన్ నిర్ణయాన్ని పొడిగించడంపై ప్రదానితో ఇప్పటికే మాట్లాడానని, కనీసంగా రెండు వారాల పాటు పొడిగించేందుకు ఎలాంటి సంశయం అవసరం లేదని, ముఖ్యమంత్రులతో మాట్లాడి ఏకాభిప్రాయాన్ని తీసుకోవచ్చని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితిని గమనిస్తున్నామని, పాతిక దేశాలు నెల రోజుల పాటు పూర్తిగా లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నాయని, 90 దేశాలు పాక్షికంగా అమలుచేస్తున్నాయని గుర్తుచేశారు. అమెరికా కేంద్రంగా పనిచేసే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు ఏకంగా జూన్ 3వ వారం వరకు లాక్‌డౌన్ కొనసాగించడం ఉత్తమమని తాజా రిపోర్టులో సూచించిందని గుర్తుచేశారు. అనేక సర్వేలు చేసిన అనుభవం ఉన్న బీసీజీ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలోనే గుర్తింపు ఉన్నదని ప్రస్తావించారు. బస్సులు, రైళ్ళు, విమానాలు తిరగడం మొదలైతే, గుళ్ళు, మసీదుల్లో, పబ్బుల్లో, క్లబ్బుల్లో, మార్కెట్లలో జనం పోగైతే ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకే ప్రమాదాన్ని నిలువరించలేమని అన్నారు. లాక్‌డౌన్ కొనసాగడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని, కానీ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నలాంటి అధునాతన వైద్య సౌకర్యాలు మన దేశంలో లేవని, పైగా మన దగ్గర కార్మికులు, పేదలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఎక్కువని, ఇలాంటి పరిస్థితుల్లో మన దేశానికి లాక్‌డౌన్ చాలా మంచి మార్గమని అన్నారు.
మర్కజ్ కారణంగానే పాజిటివ్ కేసులు పెరిగాయి
మొదటి దశలో మనకు విదేశీ ప్రయాణం చేసినవారి ద్వారా కరోనా వైరస్ అంటుకున్నదని, ఇప్పటివరకూ 25,937 మందిని క్వారంటైన్‌లో పెట్టామని, మంగళవారం రాత్రికల్లా అందరూ ఇళ్ళకు వెళ్ళిపోతారని, వీరి ద్వారా, వీటితో కాంటాక్టులోకి వెళ్ళినవారి ద్వారా వచ్చిన పాజిటివ్ కేసులు కేవలం యాభై మాత్రమేనని, మిగిలినవన్నీ మర్కజ్ ద్వారానే వచ్చాయని సీఎం అన్నారు. రెండో దశలో వచ్చిన మర్కజ్ కారణంగా 314 మందికి పాజిటివ్ వచ్చిందని, వీరిలో ఇండోనేషియాకు చెందినవారు కూడా ఉన్నారని అన్నారు. తొలి దశలోనే ఇండోనేషియావారికి వైరస్ గుర్తించినందున చికిత్స అనంతరం కోలుకున్నారని, ఒకటి రెండు రోజుల్లోనే డిశ్చార్జి అవుతారని అన్నారు. నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారు 1089 మంది అని గుర్తించామని, ఇందులో 35 మంది మినహా మిగిలినవారందరినీ పట్టుకుని, వారి కాంటాక్టులోకి వెళ్ళినవారినీ గుర్తించి ఐసొలేషన్‌లో పెట్టామన్నారు. కానీ మిగిలిపోయిన ఆ 35 మంది బహుశా ఢిల్లీలోనే ఉన్నారని, ఆ రాష్ట్ర ప్రభుత్వం వీరిని పట్టుకుని ఉండవచ్చన్నారు. ఇంకా 600 మందికి టెస్టులు జరుగుతున్నాయని, రెండు మూడు రోజుల్లో పరీక్షల రిపోర్టులు వస్తాయన్నారు.
రాష్ట్రంలో ఇంకా మనం స్టేజ్-2లోనే ఉన్నామని, ‘కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్’ అనుకునే మూడవ స్టేజీలోకి వెళ్ళలేదన్నారు. మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారి వివరాలను సేకరించడంలో ఇంటెలిజెన్స్ ప్రముఖ పాత్ర పోషించిందని, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవారికంటే వందమంది వివరాలు వారి దగ్గర ఎక్కువే ఉన్నాయన్నారు. ఇప్పటికి ఉన్న పరిస్థితిని బట్టి సుమారుగా ఇంకో 170 మందికి పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని, ఆ సంఖ్య అక్కడితోనే ఆగిపోతుందనుకుంటున్నామన్నారు. ఒకవేళ అంచనాకు మించి పెరిగితే చెప్పలేమని, లక్షణాలు ఉన్నవారి నుంచి ఇతరులకు (థర్డ్ లెవల్) ఇప్పటికే సోకి ఉంటే అదనంగా పాజిటివ్ కేసులు నమోదవుతాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్ మరికొంతకాలం కొనసాగితే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. పాజిటివ్ మనిషి ఎక్కడెక్కడ తిరిగాడో తెలియడంలేదని, లింకును కట్ చేయడం కోసమే లాక్‌డౌన్ అని అన్నారు. నిజానికి మర్కజ్ లేకుంటే రాష్ట్రంలో ఇన్ని పాజిటివ్ కేసులు ఉండేవి కావని, యాభైతోనే ఆగిపోయేదన్నారు.
ప్రజలు మరింత సహకారం ఇవ్వాలి
ఇప్పటివరకూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు లాక్‌డౌన్‌కు మంచి సహకారం ఇచ్చారని, ఇది ఇంకా పెరగాలని అన్నారు. తొలినాళ్ళలో ఒకటి రెండు రోజులు ప్రజలు నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు ఫర్వాలేదని, ఇంకా సహకారం ఇవ్వాలని, ఇళ్ళకే పరిమితం కావాలని కోరారు. లాక్‌డౌన్ కొనసాగితే ఇళ్ళలో నిర్బంధించారని ప్రజలెవ్వరూ భావించవద్దని, పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. మొదటి దశలో విదేశాల నుంచి వైరస్ మోసుకొచ్చినవారిలో ఎవ్వరూ చనిపోలేదని, చికిత్స పొంది ఇళ్ళకు చేరుకున్నారని, కానీ మర్కజ్ తర్వాతనే మృతులు పెరిగాయన్నారు. కొన్ని సందర్భాల్లో వ్యాధి లక్షణాలు బైటపడి ఆసుపత్రికి వెళ్ళేటప్పటికే మార్గమధ్యంలో చనిపోతున్నారని, ఆ వైరస్ తీవ్రత అలా ఉందని, ప్రారంభ దశలో గుర్తిస్తే చావు వరకూ వెళ్ళకుండా చికిత్స ద్వారా నయం కావచ్చని అన్నారు.
మారటోరియం మాత్రమే సరిపోదు
లాక్‌డౌన్ కారణంగా అన్ని రాష్ట్రాల, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, ఆదాయ వనరులన్నీ నిలిచిపోయాయని, ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకురావడం ద్వారా మాత్రమే ఈ అగాధాన్ని పూడ్చడం సాధ్యమవుతుందన్నారు. కేవలం మారటోరియంతో మాత్రమే సరిపెట్టుకునే పరిస్థితి కాదని, మొత్తం నష్టాన్ని అంచనా వేసి దాన్ని పూడ్చడానికి ఫార్ములాను తయారుచేయాలన్నారు. ఎకనమిక్ స్లో డౌన్, ఆర్థిక మాంద్యం… ఇలాంటి ఒక్కో సమస్యకు ఒక్కో రకమైన పరిష్కారం ఉంటుందని, ఇప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యల గురించి సీరియస్‌గా ఆలోచించాలని సీఎం సూచించారు. రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా మంచి ఆలోచనతో ఆర్టికల్ రాశారని గుర్తుచేశారు. లాక్‌డౌన్ ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందో, దీని నుంచి బైటపడడానికి ఏం చేయాలో సూచించారని అన్నారు. ప్రధాని సైతం వెంటనే ఆర్థిక వేత్తలతో, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి లాక్‌డౌన్ తదనంతర పరిస్థితులపై చర్చించాలన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి నిలిచిపోయిందని, కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని, ఆహారపు నిల్వలు ే మేరకు ఉన్నాయి, వాటిని ఎలా సర్దుకోవాలి.. లాంటి విషయాలన్నింటినీ చర్చించాలన్నారు. ముఖ్యమంత్రులతోనూ దీనిపై చర్చించాలని అన్నారు.
ఆరు కోట్ల రూపాయల ఆదాయం కూడా రాలేదు
రాష్ట్రంలో మనకు ప్రతీరోజు సుమారు రూ. 440 కోట్ల మేరకు ఆదాయం వస్తుందని, కానీ ఇప్పుడు నాలుగు రోజులకు కనీసం ఆరు కోట్లు కూడా రావడంలేదని సీఎం అన్నారు. ప్రతీ నెలా సుమారు రూ. 12 వేల కోట్లు వచ్చే చోట కేవలం రూ. 200 కోట్లు కూడా రాకుంటే రాష్ట్రం ఎలా బతుకుతుందని, ప్రజల అవసరాలను ఎట్లా తీర్చాలని ప్రశ్నించారు. ప్రజలను ఆకలితో ఉంచలేంగదా అని ప్రస్తావించిన కేసీఆర్ రిజర్వు బ్యాంకు నుంచి అప్పు ద్వారా సర్దుకోక తప్పదన్నారు. ప్రతీ ఏటా సుమారు రూ. 30 వేల కోట్ల అప్పుల్ని తీర్చాల్సి ఉంటుందని, ఆదాయమే లేనప్పుడు వాటిరి రాష్ట్రం తిరిగి ఎలా కట్టగలుగుతుందని ప్రశ్నించారు. ఇలాంటి ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఒక పాజిటివ్ ఫార్ములాను కేంద్రం ఆలోచించాలన్నారు.
వైద్య సిబ్బందికి పదిశాతం ‘సీఎం గిఫ్ట్’
కరోనా పేషెంట్లకు చికిత్స చేయడంలో వైద్య సిబ్బంది అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలను ఎంత పొగిడినా తక్కువేనన్నారు. వారి మొత్తం జీతంలో పది శాతాన్ని ‘ముఖ్యమంత్రి గిఫ్ట్’ (ప్రత్యేక ప్రోత్సాహకం) పేరుతో ఇవ్వనున్నట్లు తెలిపారు. పారిశుద్య కార్మికులకు సైతం కార్పొరేషన్ స్థాయిలో రూ. 7,500, ఆ క్రింది స్థాయిలో రూ. 5000 చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత సందర్భంగా పారిశుద్య కార్మికులకు కూడా కత్తిరింపు జరిగిందని, అయితే అది పొరపాటేనని, ఇప్పుడు వారికి ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బందిని అదనపు సంఖ్యలో సమకూర్చుకోడానికి సుమారు పాతిక వేల మంది జాబితా సిద్ధంగా ఉందని, ప్రభుత్వం ఎప్పుడు పిలుపు ఇస్తే అప్పుడు సేవల్లోకి దూకుతారని అన్నారు.
రాష్ట్రంలో పీపీఈ కిట్లు సుమారు నలభై వేల వరకు ఉన్నాయని, ఐదు లక్షలకు ఆర్డరు ఇచ్చామని, త్వరలో అవి కూడా అందుతాయన్నారు. వైద్యులకే రక్షణ లేదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు కిట్లు ఉన్నాయో లేవో ఆలోచించదా అని ప్రశ్నించారు. ఇకపైన కరోనా పాజిటివ్ కేసులన్నింటినీ గాంధీ ఆసుపత్రికే పంపుతామని, ఇది కేవలం దానికోసమే పనిచేస్తుందని అన్నారు.
Tags: corona, lock down, kcr, cm, pm, modi, covid-19,bcg, gandhi hospital, ppe, masks