ప్రపంచంలోనే తొలి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

ఇది కేవలం ఒక ప్రాంప్ట్‌తో కోడ్‌ను రాయగలదు, వెబ్‌సైట్‌లను, సాఫ్ట్‌వేర్‌లను సృష్టించగలదు.

Update: 2024-03-13 13:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఇటీవల సంచలనంగా మారిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) మరో కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే అనేక రంగాల్లో ఏఐ వినియోగం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే తాజాగా ఏఐతో రూపొందించిన మొట్టమొదటి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డెవిన్ అందుబాటులోకి వచ్చేసింది. ఇది ప్రపంచంలోనే మొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం విశేషం. అమెరికాకు చెందిన కాగ్నిషన్ కంపెనీ ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని రూపొందించింది. ఇది కేవలం ఒక ప్రాంప్ట్‌తో కోడ్‌ను రాయగలదు, వెబ్‌సైట్‌లను, సాఫ్ట్‌వేర్‌లను సృష్టించగలదు. దీన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని కాగ్నిషన్ కంపెనీ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. 'డెవిన్ ' సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రముఖ ఏఐ కంపెనీలు నిర్వహించే ప్రాక్టికల్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూలను కూడా విజయవంతంగా పూర్తి చేసిందని, ఒక ప్రాంప్ట్ ద్వారా అన్ని పనులు చక్కగా చేసేస్తుందని కంపెనీ చెబుతోంది. క్లిష్టమైన ఇంజనీరింగ్ ప్రాజెక్టులను కూడా డెవిన్ ప్లానింగ్ చేయడం, దాన్ని అమలు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంది. సొంత అనుభవం నుంచి నేర్చుకుని, ఏవైనా లోపాలను సరిదిద్దుకోగలదని కంపెనీ వివరించింది. మొత్తం సాఫ్ట్‌వేర్ ప్రపంచంలోనే ఇదొక గేమ్ ఛేంజర్ అవుతుంది. యూజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధరంగా మెరుగైన సేవలందిస్తుందని పేర్కొంది.

ఇప్పటికే ఏఐ అన్ని రంగాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో చాలమంది ఉపాధి కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు డెవిన్ కారణంగా ఉద్యోగాలు పోతాయేమోనని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కంగారు పడుతున్నారు. దీని గురించి కాగ్నిషన్ కంపెనీ స్పందించింది. ఈ ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మానవ ఇంజనీర్ల స్థానంలో భర్తీ చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకురాలేదు. ఇది వారితో కలిసి పనిచేయగలదు. అందుకోసమే దీన్ని తయారు చేశాం. వారి పనితీరును, జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ వెల్లడించింది. 

Tags:    

Similar News