AIని మనుషుల్లాగా చూడడం ఆపండి: సత్య నాదెళ్ల

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు

Update: 2024-05-22 10:20 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. AIని మనుషుల్లాగా చూడడం ఆపాలని ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మానిషిలా కాకుండా ఒక సాధనంగా చూడాలని ఉద్ఘాటించారు. అలాగే, దీనిని కృత్రిమ మేధస్సు అనే పదంతో పిలవడాన్ని కూడా విమర్శించారు, దానిని "డిఫరెంట్ ఇంటెలిజెన్స్" అని పిలవాలని సూచించారు. ఎందుకంటే AI సామర్థ్యాలు మానవ మేధస్సుకు సమానం కాదని, అందరూ ఆ విషయాన్ని గుర్తించాలని ఆయన నొక్కి చెప్పారు. గ్లోబల్‌గా చాలా టెక్ కంపెనీలు AIపై పరిశోధనలు చేస్తున్నాయి. ఈ టూల్స్‌లో మనుషుల తరహా లక్షణాలను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే AIని పూర్తిగా వాణిజ్య పరంగా మాత్రమే చూడాలి, అవసరమైనప్పుడు ఉపయోగించుకునే సాధనంగా చూడాలి తప్ప, మనుషుల మధ్య ఉన్న సంబంధాన్ని భర్తీ చేసే విధంగా ఉండకూడదని నాదెళ్ల స్పష్టం చేశారు.

ఇటీవల వేరు వేరు వాయిస్‌లతో నవ్వడం, పాడడం, మాట్లాడగల పర్సనల్ అసిస్టెంట్‌ను OpenAI ఆవిష్కరించింది. ఇలాంటి ప్రయోగాలపై నాదేళ్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత వారం, గూగుల్ ఎగ్జిక్యూటివ్ పిచాయ్ బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ, భావోద్వేగాన్ని చూపించే AI సాధనాలను రూపొందించడం సాధ్యమే అయినప్పటికీ, తమ కంపెనీ సూపర్ హెల్ప్‌ఫుల్, సూపర్ యూజ్‌ఫుల్‌గా ఉండే సాధనాలపై దృష్టి పెట్టడానికి ఇష్టపడుతుందని అన్నారు.

Similar News