కళానిధి మారన్ నుంచి రూ. 450 కోట్ల వాపసు కోరిన స్పైస్‌జెట్

గతవారం ఢిల్లీ హైకోర్టు ఎయిర్‌లైన్ కంపెనీ స్పైస్‌జెట్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే

Update: 2024-05-22 10:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: బడ్జెట్ క్యారియర్ సంస్థ స్పైస్‌జెట్ తన మాజీ ప్రమోటర్ కళానిధి మారన్ నుంచి రూ. 450 కోట్లు వాపసు ఇవ్వాలని కోరుతోంది. కొన్నేళ్ల నుంచి స్పైస్‌జెట్, మారన్‌ల మధ్య నలుగుతున్న వాటాల బదిలీ వ్యవహారంలో గతవారం ఢిల్లీ హైకోర్టు ఎయిర్‌లైన్ కంపెనీ స్పైస్‌జెట్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్ కంపెనీ మారన్‌కు చెందిన కేఏఎల్(కాల్) ఎయిర్‌వేస్‌కు షేర్ల బదిలీ సమయంలో రూ. 730 కోట్లు చెల్లించింది. అందులో రూ. 580 కోట్లు అసలు మొత్తం కాగా, వడ్డీ మరో రూ. 150 కోట్లు ఉంది. 2018లో మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ఆదేశాలను 2023లో సింగిల్ జడ్జీ బెంచ్ సైతం సమర్థిస్తూ ఆదేశాలిచ్చారు. తాజాగా దీనిపై ఈ నెల 17న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో సింగిల్ జడ్జీ బెంచ్ గతంలో ఇచ్చిన ఆర్డర్‌ను తోసిపుచ్చింది. దీంతో స్పైస్‌జెట్ భారీ మొత్తం రీఫండ్‌ను క్లెయిమ్ చేసేందుకు వీలు కల్పించింది. గత ఆర్డర్‌ను పక్కన పెట్టడంతో స్పైస్‌జెట్‌ రూ. 450 కోట్ల రీఫండ్ అందుకోనుంది. కాగా, 2015లో మారన్ స్పైస్‌జెట్‌లో తన 58.46 శాతం వాటాను ప్రస్తుత వాటాదారు అజయ్ సింగ్‌కు బదిలీ చేశారు. పెట్టుబడులకు ప్రతిఫలంగా రిడీమ్ చేసే వారెంట్లను మారన్ కోరారు. అప్పటినుంచే ఈ కేసు ప్రారంభమైంది. తనకు నగదుతో పాటు వారెంట్లు కూడా ఇవ్వలేదని, దానివల్ల రూ. 1,323 కోట్ల నష్టం వాటిల్లిందని కళానిధి మారన్ పేర్కొన్నారు. దీనిపై ఆయన ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా 2018, జూలైలో స్పైస్‌జెట్‌ను రూ. 270 కోట్లు వాపసు చేయాలని, వారెంట్లకు చెల్లించిన మొత్తంపై 12 శాతం వార్షిక వడ్డీ, సకాలంలో ఇవ్వకపోతే ఆ మొత్తంపై 18 శాతం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.  

Tags:    

Similar News