దేశంలో ఎన్నికల ఎఫెక్ట్‌తో మందగించిన రోడ్ల నిర్మాణం

ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా రోడ్ల నిర్మాణాలు మందగించినట్లు భారత రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ నుండి డేటా చూపించింది

Update: 2024-05-24 10:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా రోడ్ల నిర్మాణాలు మందగించినట్లు భారత రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ డేటా చూపించింది. ఏప్రిల్‌లో సుమారు 483 కి.మీ జాతీయ రహదారులను మాత్రమే నిర్మించారు. దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ల్యాండ్ క్లియరెన్స్ మందగించడం వల్ల హైవే నిర్మాణాలు తగ్గినట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కరోనా తర్వాత ఈ ఏడాది రెండు నెలల్లో రోడ్ల నిర్మాణ వేగం నెమ్మదించినట్లు డేటా పేర్కొంది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి మొత్తం పూర్తయ్యే వరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, మంత్రులు, ఇతర అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది. రోడ్ల నిర్మాణలతో సహా కొత్త ప్రాజెక్టులను ప్రకటించకుండా కోడ్ అడ్డంకిగా ఉంటుంది. దీంతో రోడ్ల నిర్మాణాల అనుమతులకు బ్రేక్ పడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

అలాగే రోడ్ల నిర్మాణంలో పనిచేసే కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం తమ గ్రామాలకు వెళ్లడం కూడా నిర్మాణాలు మరింత ఆలస్యం అయ్యేలా చేస్తుందని వారు అన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వేగవంతం అవుతాయని అధికారులు చెప్పారు. కేర్‌ఎడ్జ్ అంచనాల ప్రకారం, ఎఫ్‌వై 24లో 12,349 కి.మీ హైవేలు నిర్మించగా, ఎఫ్‌వై 25లో 11,100-11,500 కి.మీ హైవేలను నిర్మించే అవకాశం ఉందని తెలిపింది.

Similar News