రూ. 1,200 కోట్ల అప్పులు చెల్లించనున్న అనిల్ అంబానీ!
అప్పుల్లో కూరుకుపోయిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ తాజాగా తన రిలయన్స్ పవర్ అనుబంధ కంపెనీ విధర్భ ఇండస్ట్రీస్ పవర్ (వీఐపీఎల్) అప్పులు చెల్లించే ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది.
ముంబై: అప్పుల్లో కూరుకుపోయిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ తాజాగా తన రిలయన్స్ పవర్ అనుబంధ కంపెనీ విధర్భ ఇండస్ట్రీస్ పవర్ (వీఐపీఎల్) అప్పులు చెల్లించే ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. బ్యాంకులకు ఇవ్వాల్సిన రూ. 1,200 కోట్లను వన్-టైమ్ సెటిల్‌మెంట్(ఓటీఎస్) కింద చెల్లించడానికి సిద్ధమైనట్టు సమాచారం. ఈ మేరకు రిలయన్స్ పవర్ ఓటీఎస్ కోసం సింగపూర్‌కు చెందిన గ్లోబల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ వర్డే పార్ట్‌నర్స్ అంగీకరించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిలయన్స్ పవర్ గతేడాది సెప్టెంబర్‌లో రూ.1200 కోట్ల వరకు రుణాన్ని పొందేందుకు వర్డే పార్ట్‌నర్స్‌తో ఒప్పందం చేసుకుంది.
అంతకుముందు 2021లో వర్డే పార్ట్‌నర్స్ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో రూ.550 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ సంస్థ అనేక ఇతర పవర్ కంపెనీల్లో సైతం తన పెట్టుబడులను కలిగి ఉంది. ఈ క్రమంలోనే తాజా అప్పుల చెల్లింపునకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రిలయన్స్ పవర్ ప్రతిపాదన ప్రకారం యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలకు రూ. 1,200 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా, 2022, మార్చి నాటికి విధర్భ ఇండస్ట్రీస్ పవర్ మొత్తం అప్పులు రూ. 2,200 కోట్లు.