భారీగా బంగారం కొంటున్న ఆర్‌బీఐ

ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య నాలుగు నెలల్లోనే 24 టన్నుల పసిడిని ఆర్‌బీఐ నిల్వ చేసింది.

Update: 2024-05-23 11:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) భారీగా బంగారం కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య నాలుగు నెలల్లోనే 24 టన్నుల పసిడిని ఆర్‌బీఐ నిల్వ చేసింది. గత కొన్ని నెలలుగా బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇది కూడా ఆర్‌బీఐ పసిడి నిల్వలు పెంచేందుకు కారణంగా ఉంది. విదేశీ మారక నిల్వల విస్తరణలో భాగంగానే ఆర్‌బీఐ పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటోంది. తాజా కొనుగోలు మొత్తం 2023 ఏడాది మొత్తంలో కొనుగోలు చేసిన 16 టన్నుల కంటే ఒకటిన్నర రెట్లు అధికం కావడం విశేషం. ఆర్‌బీఐ డేటా ప్రకార, గతేడాది డిసెంబర్ నాటికి సెంట్రల్ బ్యాంకు వద్ద 803.6 టన్నులు ఉండగా, 2024, ఏప్రిల్ 26 నాటికి ఇది 827.69 టన్నులకు పెరిగింది. మొత్తం విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 2023, డిసెంబర్ నాటికి 7.75 శాతం ఉండగా, 2024, ఏప్రిల్ ఆఖరు నాటికి 8.7 శాతానికి పెరిగింది. బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్న కారణంగా వాల్యూమ్‌లతో పాటు విలువ పరంగా కూడా ఆర్‌బీఐ లాభాలను పొందుతోంది. భవిష్యత్తులో డాలర్‌ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తే, అలాంటి ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే విదేశీ మారక నిల్వలు పెంచడంపై గత ఐదేళ్లుగా దృష్టి సారించింది. 

Tags:    

Similar News