ప్రభుత్వానికి రూ. 2.11 లక్షల కోట్ల మిగులు నిధులు బదిలీ చేయనున్న ఆర్‌బీఐ

కేంద్ర బోర్డు డైరెక్టర్లు బుధవారం సమావేశమై, మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీపై చేసే విషయంపై నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-05-22 11:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వానికి రూ. 2.11 లక్షల కోట్ల నిధులను బదిలీ చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బోర్డు ఆమోదం తెలిపింది. కేంద్ర బోర్డు డైరెక్టర్లు బుధవారం సమావేశమై, మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీపై చేసే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్‌బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ ప్రకారం, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్‌బీఐతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి సుమారు రూ. 1.02 లక్షల కోట్ల డివిడెండ్‌ను అంచనా వేసింది. 2023-24లో సవరించిన అంచనా రూ.1.04 లక్షల కోట్ల కంటే ఇది తక్కువే. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ రూ.87,416 కోట్ల మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసింది. అలాగే, ఈ సమావేశంలో ఆర్‌బీఐ బోర్డు కంటిన్‌జెన్సీ(ఆకస్మిక) రిస్క్ బఫర్‌ను గతంలో ఉన్న 6 శాతం నుంచి 6.5 శాతానికి పెంచాలని నిర్ణయించింది.

Tags:    

Similar News