ఎండల ఎఫెక్ట్‌తో సీజన్‌లోనే శుక్రవారం గరిష్ట స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు రోడ్లపైకి రావాలంటే హడలిపోతున్నారు

Update: 2024-05-25 10:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు రోడ్లపైకి రావాలంటే హడలిపోతున్నారు. వేడిగాలుల నుంచి తట్టుకోడానికి ఎయిర్ కండిషనర్లు, కూలర్‌ల వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ఈ సారి వీటి వాడకం ఎక్కువ కావడంతో ఈ సమ్మర్‌లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. తాజాగా విద్యుత్ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన డేటా ప్రకారం, ఈ సీజన్‌లో శుక్రవారం నాడు విద్యుత్ డిమాండ్ కొత్త గరిష్ట స్థాయి 239.96 GWని తాకింది. ఇది ఈ సంవత్సరం వేసవి సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన గరిష్టం.

అలాగే, గురువారం, ఇది 236.59 GW కాగా, బుధవారం గరిష్ట విద్యుత్ డిమాండ్ 235.06 GW వద్ద ఉందని విద్యుత్ మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది. గతంలో సెప్టెంబర్ 2023లో ఆల్-టైమ్ హై పీక్ పవర్ డిమాండ్ 243.27 GW నమోదైంది. ఈ సారి ఎండలు మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, విద్యుత్ సరఫరా డిమాండ్ కూడా అధికంగానే ఉంటుందని నిపుణులు గతంలోనే పేర్కొనగా, అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది.

ఈ నెల ప్రారంభంలో, విద్యుత్ మంత్రిత్వ శాఖ మే నెలలో పగటిపూట 240 GW, సాయంత్రం వేళల్లో 225 GW విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసింది. సెప్టెంబర్ 2023లో నమోదైన రికార్డును మరికొద్ది రోజుల్లో బ్రేక్ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 2024లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేసవి కాలం ప్రారంభమైనప్పుడు, గరిష్ట విద్యుత్ డిమాండ్ 224.18 GWగా ఉందని డేటా చూపిస్తుంది. భారతదేశ వాతావరణ విభాగం (IMD) ఈ సంవత్సరం ఎల్‌నినో పరిస్థితులతో వేడి ప్రభావం మరికొద్ది రోజులు ఇలాగే ఉంటాయని పేర్కొ్ంది.

Similar News