జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ సతీమణి కన్నుమూత

జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ క్యాన్సర్‌తో బాధపడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు

Update: 2024-05-16 07:36 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ క్యాన్సర్‌తో బాధపడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. తెల్లవారుజామున 3 గంటలకు ముంబైలోని వారి నివాసంలో మరణించినట్లు సంబంధిత వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. నరేష్-అనితా గోయల్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. మనీ-లాండరింగ్ కేసుకు సంబంధించి నరేష్ గోయల్ సెప్టెంబర్ 1, 2023న అరెస్ట్ కాగా, ఇదే ఆరోపణలతో అనితా గోయల్‌ను సైతం నవంబర్‌లో అరెస్ట్ చేశారు. అయితే ఆమె అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా బాంబే హైకోర్టు అదే రోజు బెయిల్ మంజూరు చేసింది.

తన భార్యతో పాటు నరేష్ గోయల్ కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్న కారణంగా ఆయన తన భార్యతో కలిసి ఉండేందుకు మానవతా దృక్పథంతో ఈ నెల ప్రారంభంలో బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జెట్ ఎయిర్‌వేస్ గ్రూపునకు కెనరా బ్యాంక్ రూ.848 కోట్లకు పైగా రుణాన్ని అందించింది. అయితే దీనిలో రూ.538.62 కోట్లను కంపెనీ తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంక్ కేసు పెట్టింది. ఈ కేసులో మనీలాండరింగ్ నేరం జరిగినట్టు తేలడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తును ప్రారంభించింది. జెట్ ఎయిర్‌వేస్ తన రోజువారీ ఖర్చులను నిర్వహించడానికి 10 బ్యాంకుల కన్సార్టియం నుండి డబ్బును రుణంగా తీసుకుందని ఈడీ ఆరోపించింది. మనీ-లాండరింగ్ కేసుకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయన ఇటీవల అనారోగ్య పరిస్థితుల దృష్టా ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు.

Similar News