వారాంతం ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

నిఫ్టీ చరిత్రలో తొలిసారి 23,000 మార్కును చేరింది.

Update: 2024-05-24 16:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారాంతం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతకుముందు సెషన్‌లో రికార్డు గరిష్ఠాల వద్ద ముగిసిన అనంతరం శుక్రవారం ట్రేడింగ్‌లో రోజంతా లాభనష్టాల మధ్య సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ సరికొత్త రికార్డులను తాకగా, నిఫ్టీ చరిత్రలో తొలిసారి 23,000 మార్కును చేరింది. అయితే, ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి కారణంగా మదుపర్ల సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ స్వల్పంగా 7.65 పాయింట్లు నష్టపోయి 75,410 వద్ద, నిఫ్టీ 10.55 పాయింట్ల నష్టంతో 22,957 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా రంగాలు నీరసించాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఆల్ట్రా సిమెంట్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. టెక్ మహీంద్రా, ఐటీసీ, ఎంఅండ్ఎం, టీసీఎస్, టైటాన్, ఏషియన్ పెయింట్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.06 వద్ద ఉంది. 

Tags:    

Similar News