ఎఫ్‌వై24 నాలుగో త్రైమాసికంలో దేశ జీడీపీ 6.1-6.7 శాతం వృద్ధి: ఆర్థికవేత్తలు

భారతదేశ జీడీపీ 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 6.1-6.7 శాతం పరిధిలో వృద్ధి చెందుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు

Update: 2024-05-26 08:22 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశ జీడీపీ 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 6.1-6.7 శాతం పరిధిలో వృద్ధి చెందుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. జనవరి-మార్చి 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక అంచనాలను మే 31న ప్రభుత్వం విడుదల చేయనున్న నేపథ్యంలో తాజాగా ఆర్థిక వేత్తలు ఈ అంచనాను లెక్కగట్టారు. ప్రస్తుతం దేశంలో పెట్టుబడులకు సానుకూల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల ఫలితాల తరువాత ఏర్పడే కొత్త ప్రభుత్వంలో పరిశ్రమలకు పెట్టుబడులకు సంబంధించిన ప్రోత్సహకాలు, రాయితీలు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి రానున్న రోజుల్లో దేశ జీడీపీ మరింత వృద్ధి చెందుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ఉపాస్న భరద్వాజ్ మాట్లాడుతూ, తయారీ కార్యకలాపాలు బాగున్నాయి, నిర్మాణ ఆధారిత, పెట్టుబడి విభాగాలు మెరుగ్గా పని చేయాలి, అయితే వ్యవసాయ రంగం వృద్ధి వెనుకబడి ఉండవచ్చు, కానీ అది కూడా త్వరలో సానుకూలంగా ఉంటుంది. నాల్గవ త్రైమాసికంలో 6.1 శాతం జీడీపీ వృద్ధిని మేము ఆశిస్తున్నామని ఆయన అన్నారు. గ్రామీణ వినియోగ డిమాండ్ వేగం పుంజుకుంటుంది, అయితే పట్టణ డిమాండ్ వైపు కొంత తగ్గింపును చూడవచ్చు. అందువల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగంపై కొంత సానుకూల ప్రభావం ఉండవచ్చని భరద్వాజ్ చెప్పారు.

ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.5 శాతానికి మించి ఉంటుందని అంచనా వేశారు. ఇదే సమయంలో ఇండియా రేటింగ్స్ & రీసెర్చ్ మార్చి త్రైమాసికంలో జీడీపీ 6.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఇంతకుముందు ఏప్రిల్‌లో రిజర్వ్ బ్యాంక్ తన ద్రవ్య విధాన సమీక్షలో, 2023-24కి భారత జీడీపీ వృద్ధిని 7 శాతంగా అంచనా వేసింది.

Similar News