విమాన సర్వీసుల రద్దును పొడిగించిన గోఫస్ట్!

అప్పుల ఊబిలో ఉన్న విమానాయన సంస్థ గోఫస్ట్ కార్యకలాపాల నిర్వహణ కారణాలతో తన అన్ని విమానాల సర్వీసులను ఈ నెలాఖరు వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

Update: 2023-08-28 09:44 GMT

న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో ఉన్న విమానాయన సంస్థ గోఫస్ట్ కార్యకలాపాల నిర్వహణ కారణాలతో తన అన్ని విమానాల సర్వీసులను ఈ నెలాఖరు వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది మేలో స్వచ్ఛందంగా దివాలా పిటిషన్ దాఖలు చేసిన కంపెనీ, పలు దశల్లో విమానా సేవలను రద్దు చేస్తూ వచ్చింది. తాజాగా ఆగష్టు 27 వరకు రద్దును కొనసాగించిన గోఫస్ట్ మరోసారి దీన్ని పొడిగించింది. కార్యకలాపాల్లో సమస్యల వల్లనే రద్దును పొడిగించామని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని కంపెనీ ఎక్స్(ట్విటర్) ద్వారా వెల్లడించింది.

తక్షణ పరిష్కారం, కార్యకలాపాల పునరుద్ధరణ కోసం పిటిషన్‌ను దాఖలు చేశామని, త్వరలో బుకింగ్‌లను పునఃప్రారంభించడంపై ఆశాజనకంగా ఉన్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే గోఫస్ట్ సంస్థపై విమానాల లీజింగ్ కంపెనీ ఏసీజీ ఎయిర్‌క్రాఫ్ట్ తమ లీజింగ్ విమానాల్లోని విడిభాగాల అదృశ్యంపై కోర్టు దృష్టి తీసుకెళ్లింది. అదృశ్యమైన వాటిలో ఇంజిన్ ఫ్యాన్ బ్లేడ్లు, పైలట్ సైడ్ స్టిక్ వంటి విడిభాగాలు ఉన్నాయని సమాచారం.

Tags:    

Similar News