ఎనిమిది నెలల గరిష్ఠానికి ఇంధన గిరాకీ!

ఈ ఏడాది నవంబర్‌లో దేశీయ ఇంధన గిరాకీ ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది.

Update: 2022-12-09 16:39 GMT

న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో దేశీయ ఇంధన గిరాకీ ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. శుక్రవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పండుగ సీజన్, పారిశ్రామిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడంతో ఇంధన అమ్మకాలు పుంజుకున్నాయి. భారత చమురు మంత్రిత్వ శాఖ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్(పీపీఏసీ) డేటా ప్రకారం, సమీక్షించిన నెలలో ఇంధన వినియోగం అంతకుముందు నెలలో పోలిస్తే 2.4 శాతం, గతేడాది నవంబర్‌తో పోలిస్తే 10.2 శాతం పెరిగి రూ. 1.88 కొట్ల టన్నులకు చేరుకుంది.

పండుగ సీజన్ మద్దతుతో ఇంధన అమ్మకాలు భారీగా పెరిగాయి. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నందున, రానున్న కొద్ది నెలల్లో చమురు అమ్మకాలు అధికంగా ఉండనున్నాయని పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

నవంబర్‌లో అత్యధికంగా వినియోగించే డీజిల్ అమ్మకాలు 2021, నవంబర్ నాటి కంటే 19.1 శాతం పెరిగి 77.6 లక్షల టన్నులకు చేరుకోగా, పెట్రోల్ అమ్మకాలు 8.1 శాతం పెరిగి 28.6 లక్షల టన్నులుగా నమోదయ్యాయని పీపీఏసీ పేర్కొంది. వంట గ్యాస్ అమ్మకాలు 5.2 శాతం పెరిగి 24.7 లక్షల టన్నులకు చేరుకున్నాయి.

Similar News