రికార్డు గరిష్ఠాలకు చేరిన స్టాక్ మార్కెట్లు

కీలక సెన్సెక్స్ 1,200 పాయింట్లు, నిఫ్టీ 370 పాయింట్లతో సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకాయి.

Update: 2024-05-23 13:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను సాధించాయి. గురువారం వారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన ట్రేడింగ్‌లో ఆర్‌బీఐ బోర్డు కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్ ఇచ్చేందుకు ఆమోదం తెలపడం, కీలక బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో మదుపర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపడం వంటి పరిణామాలతో సూచీలు పుంజుకున్నాయి. మిడ్-సెషన్ నుంచి ఆర్‌బీఐ డివిడెండ్ సెంటిమెంట్ బలపడటం, దేశంలో కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగుతుందనే అంచనాలు, భారత ఎగుమతులు పెరగడం, మే నెల ఉద్యోగాల కల్పన పెరగడం వంటి పరిణామాలతో కీలక సెన్సెక్స్ 1,200 పాయింట్లు, నిఫ్టీ 370 పాయింట్లతో సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,196.98 పాయింట్లు పుంజుకుని 75,418, నిఫ్టీ 369.85 పాయింట్లు ఎగసి 22,967 వద్ద ముగిశాయి. నిఫ్టీలో దాదాపు అన్ని రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ కంపెనీల షేర్లు మాత్రమే నష్టాలను చూశాయి. మిగిలిన అన్నీ లాభపడ్డాయి. ముఖ్యంగా ఎల్అండ్‌టీ, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకి, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్స్ 2-4 శాతం మధ్య లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.25 వద్ద ఉంది. స్టాక్ మార్కెట్ల రికార్డు ర్యాలీతో మదుపర్ల సంపద ఒక్కరోజే రూ. 4.28 లక్షల కోట్లు పెరగడంతో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 420 లక్షల కోట్లతో ఆల్‌టైమ్ హైకి చేరింది. 

Tags:    

Similar News