ప్రధాన నగరాల్లో సగటున 23 శాతం పెరిగిన ఇళ్ల అద్దెలు!

దేశవ్యాప్తంగా ఇళ్ల అద్దెలు ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతున్నాయి.

Update: 2023-02-12 12:41 GMT

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇళ్ల అద్దెలు ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తాజా గణాంకాల ప్రకారం.. దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో 2019 నుంచి 2022 మధ్య 1,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అద్దె సగటున 23 శాతం పెరిగింది. ఇళ్ల అద్దెలు గతేడాది గణనీయంగా పెరిగాయని అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అనూజ్ పురి అన్నారు. హైబ్రిడ్ పని విధానం సహా చాలా కంపెనీలు తమ ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు పిలుస్తున్న నేపథ్యంలో అద్దెలకు డిమాండ్ పెరిగిందని ఆయన తెలిపారు.

కొందరు ఉద్యోగులు తమ స్వస్థలాల నుంచి ఆఫీసులు ఉన్న ప్రాంతాలకు వచ్చేవారు స్వల్ప కాలానికి ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఇది కూడా అద్దె గిరాకీ పెరిగేందుకు దోహదపడింది. ప్రస్తుత ఏడాది ఇదే ధోరణి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. నివేదిక వివరాల ఆధారంగా, అత్యధికంగా నోయిడా సెక్టార్ 150లో 23 శతం పెరిగి నెలకు రూ. 19 వేలకు చేరుకున్నాయి.

ఈ ప్రాంతంలో 2019లో సగటు నెల అద్దె రూ. 15,500గా ఉండేది. అలాగే, హైదరాబాద్‌లోని హైటెక్ సితీలో 2019లో సగటు నెల అద్దె రూ. 23 వేలు ఉండగా, 2022 నాటికి 7 శాతం పెరిగి రూ. 24,600కి చేరుకుంది. గచ్చిబౌలిలో 6 శాతం పెరిగి రూ. 23,400గా ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, గురుగ్రామ్‌లో 14 శాతం పెరిగి రూ. 28,500, ద్వారకలో 13 శాతం వృద్ధితో రూ. 22 వేలకు, ముంబై మెట్రోలోని చెంబూరులో 13 శాతం పెరిగి రూ. 51 వేలకు, ములుంద్‌లో 6 శాతం పెరిగి రూ. 41 వేలకు చేరింది. కోల్‌కతాలోని ఈఎం బైపాస్‌లో 16 శాతం, రాజర్‌హట్‌లో 11 శాతం, బెంగళూరులోని సర్జాపూర్‌లో 14 శాతం, వైట్‌ఫీల్డ్‌లో 18 శాతం, పూణెలోని హింజెవడిలో 20 శాతం, వాఘోలిలో 21 శాతం, చెన్నైలోని పెరంబూరులో 13 శాతం, పల్లవరంలో 17 శాతం సగటున ఇళ్ల అద్దెలు పెరిగాయని నివేదిక వెల్లడించింది.

Tags:    

Similar News