మే నుంచి కార్ల ధరలను 1.6 శాతం పెంచిన ఆడి ఇండియా!

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తన క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది.

Update: 2023-04-11 09:49 GMT

న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తన క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. కస్టమ్ డ్యూటీ, ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా మే 1వ తేదీ నుంచి ఎంపిక చేసిన కార్ల ధరలను 1.6 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ ఇప్పటికే క్యూ8 సెలబ్రేషన్, ఆర్ఎస్5, ఎస్5 మోడల్ కార్ల ధరలను 2.4 శాతం వరకు పెంచింది.

వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు, ఫీచర్లతో కూడిన వాహనాలను అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. అయితే, కస్టమ్ డ్యూటీ, ఇతర వాహన తయారీ ఖర్చులు పెరిగిన కారణంగా ధరలను పెంచాల్సి వచ్చిందని ఆడి ఇండియా హెడ్ బల్‌బీర్ సింగ్ థిల్లాన్ ఓ ప్రకటనలో తెలిపారు.

కంపెనీ ఇప్పటికే వివిధ స్థాయిలలో ఖర్చుల భారాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోందని, సాధ్యమైనంత వరకు వినియోగదారులకు బదిలీ కాకుండా చూస్తున్నామని, అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో కొంతవరకు ధరలు పెంచుతున్నట్టు ఆయన వివరించారు.

కాగా, ఇటీవలే మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఇన్‌పుట్ ఖర్చులు, ముఖ్యంగా కరెన్సీ విలువల్లో హెచ్చుతగ్గుల ప్రభావం వల్ల వివిధ మోడళ్లపై రూ. 2-12 లక్షల మధ్య ధరలను పెంచిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News