వేగంగా పెరిగే డిజిటలైజేషన్‌తో కొత్త ప్రమాదాలు: బ్యాంక్ ఆఫ్ జపాన్ చీఫ్

ఆర్థిక ఆవిష్కరణల ప్రయోజనాలు, ఖర్చుల మధ్య సరైన సమతుల్యత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

Update: 2024-03-06 09:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఆసియా ప్రాంతంలో వేగవంతంగా జరుగుతున్న డిజిటలైజేషన్ వల్ల ఆర్థికవ్యవస్థల స్థిరత్వానికి కొత్త ప్రమాదాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ జపాన్(బీఓజే) గవర్నర్ కజువొ ఉడా అన్నారు. ఆర్థిక ఆవిష్కరణల ప్రయోజనాలు, ఖర్చుల మధ్య సరైన సమతుల్యత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం బీఓజే ఆధ్వర్యంలో ఆసియా-పసిఫిక్ అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రసంగించిన ఆయన.. 'ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసులు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. ఎందుకంటే నేరుగా ఆర్థిక సేవలకు వీలులేని వర్ధమాన దేశాల్లోని వ్యక్తులు రోజువారీ చెల్లింపులకు స్మార్ట్‌ఫోన్ ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు ఆర్థిక వృద్ధిని మెరుగుపరుస్తాయి. ఇదే సమయంలో సైబర్ సెక్యూరిటీ రిస్క్, మనీలాండరింగ్ నిరోధకతను మెరుగుపరచడం వంటి విధాన నిర్ణయాల అవసరాలను కూడా పెంచుతాయని' కజువొ ఉడా వివరించారు. 'క్రిప్టో కరెన్సీ, టోకనైజేషన్, ఏఐ, ఇతర కొత్త టెక్నాలజీల వల్ల అవకాశాలు లభించవచ్చు. కానీ, అవి ఆర్థికవ్యవస్థలను ప్రమాదంలో నెట్టేలా చేయగలవని' హెచ్చరించారు. ఆర్థికవ్యవస్థల స్థిరత్వం కోసం రిస్క్‌లను సమర్థవంతంగా నిర్వహించడం, ఆర్థిక డిజిటలైజేషన్ ప్రయోజనాలను ఉపయోగించుకోవడంలో అధికారులు క్లిష్టమైన సవాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

Tags:    

Similar News