ఉద్యోగుల జీతాలు పెంచిన ఎయిర్ఇండియా

టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ఇండియా తన ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్టు ప్రకటించింది.

Update: 2024-05-24 03:13 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ఇండియా తన ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పైలట్ల పనితీరు ఆధారంగా బోనస్ కూడా ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం నుంచి టాటా అధీనంలోకి వచ్చిన తర్వాత సంస్థ తొలిసారిగా వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2024, ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాల పెంపు అమలవుతుందని ఎయిర్ఇండియా సీహెచ్ఆర్ఓ రవీంద్రకుమార్ జీపీ వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ, ఉద్యోగుల పనితీరు ఆధారంగా బోనస్ చెల్లిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. తాజా పెంపు నిర్ణయం 2023, డిసెంబర్ 31 కంటే ముందు సంస్థలో చేరిన వారికి వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

సంస్థ వివరాల ప్రకారం, ఫస్ట్ ఆఫీసర్, కెప్టెన్‌ల జీతాలు నెలకు రూ. 5,000 వరకు పెరగనుంది. కమాండర్ల జీతాలు రూ. 11,000 సీనియర్ కమాండర్ వేతనం రూ. 15,000 వరకు పెరగనున్నాయి. జూనియర్ ఫస్ట్ ఆఫీసర్‌లకు ఎలాంటి పెంపు ఇవ్వలేదు. ఇక, పనితీరు ఆధారంగా ఏడాదికి గరిష్ఠంగా రూ. 1.8 లక్షల వరకు బోనస్ ఇస్తున్నట్టు కంపెనీ వివరించింది. జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు రూ. 42,000, ఫస్ట్ ఆఫీసర్లకు రూ. 50,000, కెప్టెన్‌లకు రూ. 60,000, కమాండర్లకు రూ. 1.32 లక్షలు, సీనియర్ కమాండర్లకు రూ. 1.8 లక్షల వరకు బోనస్ ఇస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. కాగా, ప్రస్తుతం ఎయిర్ఇండియాలో మొత్తం 18,000 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Similar News