డేటా సెంటర్ కోసం $1.44 బిలియన్లను సమీకరించిన AdaniConneX

డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎడ్జ్‌కానెక్స్‌‌తో కలిసి 50:50 ప్రాతిపదికన అదానీకానెక్స్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసింది.

Update: 2024-04-28 12:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎడ్జ్‌కానెక్స్‌‌తో కలిసి 50:50 ప్రాతిపదికన అదానీకానెక్స్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. దీని ద్వారా భారత్‌లో డేటా సెంటర్ సామార్థ్యాన్ని మరింత విస్తరించాలని అదానీ గ్రూప్ భావిస్తుంది. 2030 నాటికి మొత్తం 1 గిగావాట్ సామర్థ్యంతో తొమ్మిది డేటా సెంటర్‌లను నిర్మించాలని అదానీకానెక్స్ యోచిస్తోంది. ఈ వెంచర్‌లో 1.5 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం 1.44 బిలియన్ డాలర్లను సమీకరించినట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఆదివారం తెలిపింది. మొత్తం 8 గ్లోబల్ బ్యాంకుల నుండి ఈ మొత్తాన్ని సేకరించినట్లు కంపెనీ పేర్కొంది.

చెన్నైలో ఇప్పటివరకు ఒకే ఒక డేటా సెంటర్‌ను కలిగి ఉన్న అదానీకానెక్స్.. నోయిడా, హైదరాబాద్ సౌకర్యాలలో దాదాపు మూడింట రెండు వంతుల నిర్మాణాన్ని పూర్తి చేసింది. త్వరలో ఇవి కూడా ప్రారంభం కానున్నాయి. పర్యావరణ అనుకూలంగా, అత్యాధునిక సాంకేతికతతో, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలతో వీటిని నిర్మిస్తున్నారు. అదానీకానెక్స్ సీఈఓ జనకరాజ్ మాట్లాడుతూ, భారత్‌లో డిజిటల్ వృద్ధిని వేగవంతం చేసే స్థిరమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడంలో సవాళ్లను దాటి నిలబడటానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Similar News