ఫ్రెషర్‌ల నియామకంపై దృష్టి పెట్టిన 50% రిటైల్ సంస్థలు

దేశంలో 50 శాతానికి పైగా రిటైల్ సంస్థలు ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఫ్రెషర్‌లను నియమించుకోడానికి ఆసక్తి కలిగి ఉన్నాయని GI గ్రూప్ హోల్డింగ్‌కు చెందిన ఒక నివేదిక పేర్కొంది

Update: 2024-05-09 08:54 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో 50 శాతానికి పైగా రిటైల్ సంస్థలు ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఫ్రెషర్‌లను నియమించుకోడానికి ఆసక్తి కలిగి ఉన్నాయని GI గ్రూప్ హోల్డింగ్‌కు చెందిన ఒక నివేదిక పేర్కొంది. అలాగే, ప్రతి ఐదుగురిలో ఇద్దరు (38 శాతం) అనుభవజ్ఞులైన నిపుణులను రిక్రూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. 2023లో, రిటైల్ పరిశ్రమ కొత్త ఉద్యోగ దరఖాస్తులో 8 శాతం గణనీయమైన పెరుగుదలను చవిచూసింది, డిమాండ్ దాదాపు 18 శాతం పెరిగింది. ఈ రంగంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండటం వలన దరఖాస్తులు క్రమంగా పెరుగుతున్నాయని నివేదిక తెలిపింది. ముఖ్యంగా 86.86 శాతం మంది దరఖాస్తుదారులు 18 నుంచి 30 మధ్య వయస్సు గలవారు, రిటైల్‌లో కెరీర్‌ల పట్ల యువతలో బలమైన ఆసక్తి ఉందని ఈ లెక్కలను చూస్తే అర్థం అవుతుందని నివేదిక పేర్కొంది.

దేశంలోని టైర్-1 నగరాలు ఉద్యోగార్ధులకు కేంద్రాలుగా ఉద్భవించాయి, మొత్తం దరఖాస్తుదారుల్లో ఈ నగరాల వాటా 58.49 శాతంగా ఉంది. తర్వాత టైర్-2, టైర్-3 పట్టణాలు ఉన్నాయి. రిటైల్‌లో ఎక్కువ ఉద్యోగాలు ఫ్రంట్‌లైన్ సేల్స్ లేదా కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో ఉన్నాయి. ఈ ఉద్యోగాల్లో చేరడం ద్వారా తరువాత సాధారణ వ్యాపార కార్యకలాపాల పర్యవేక్షణ వంటి పెద్ద స్థాయి వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని GI గ్రూప్ హోల్డింగ్‌ నివేదిక అభిప్రాయపడింది.

రిటైల్, ఈ-కామర్స్ రంగాలలో వృద్ధి, సామర్థ్యాన్ని పెంచడంలో టెక్ అడాప్షన్ కీలకమైన అంశంగా ఉద్భవించింది. అధిక వృద్ధితో ఉన్న వ్యాపారాలు అధిక స్థాయి సాంకేతికతను స్వీకరిస్తున్నాయని, ఖర్చులను తగ్గించడంలో, జాబితాను నిర్వహించడంలో, వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడంలో కొత్త సాంకేతికతను రిటైల్ సంస్థలు అందిపుచ్చుకుంటున్నాయని నివేదిక పేర్కొంది.

Similar News