కంబోడియా కథ కంచికి.. బాధితులు ఇంటికి

కంబోడియాలో చిక్కుకన్న విశాఖ బాధితులకు విముక్తి లభించింది..

Update: 2024-05-24 12:54 GMT

దిశ, వెబ్ డెస్క్: కంబోడియాలో చిక్కుకన్న విశాఖ బాధితులకు విముక్తి లభించింది. ఏపీ నుంచి వెళ్లి కంబోడియాలో సైబర్ మోసానికి గురయ్యారు. విశాఖకు చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌కు ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేశారు. విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన భారత ఎంబసీ అధికారులు.. ఆపరేషన్ కంబోడియా చేపట్టారు. 420 మంది భారతీయులు సైబర్ నేరాల బారిన పడ్డారని గుర్తించారు. 360 మందిని కంబోడియా పోలీసుల చెర నుంచి సురక్షితంగా కాపాడారు. దీంతో కంబోడియా బాధితులు సురక్షితంగా భారత్‌కు చేరుకుంటున్నారు. తాజాగా విశాఖకు చెందిన 60 మంది బాధితులు ఎయిర్ ఇండియా విమానంలో స్వరాష్ట్రానికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో వీరికి సీపీ రవిశంకర్ అయ్యనార్ స్వాగతం పలికారు.

కాగా కంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయంటూ, మంచి వేతనం అందజేస్తామని గాజువాకకు చెందిన రాజేశ్ విజయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా ప్రకటనలిచ్చారు. దీంతో రాష్ట్రానికి చెందిన 150 మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు అప్లై చేశారు. ఒక్కొక్కరు లక్షన్నర చెల్లించారు. వీరిని బ్యాంకాక్, సింగపూర్ మీదుగా కంబోడియాకు తరలించారు. అయితే వీరందరిన్ని నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఓ గ్యాంగ్ చైనా ముఠాకు అమ్ముకున్నారు. ఒక్కొక్కరిని రూ.2,500 నుంచి రూ.4 వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలు కొనుగోలు చేశాయి. అయితే వీరి నుంచి తప్పించుకున్న విశాఖకు చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హ్యూమన్ ట్రాఫికింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖ సీపీ రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో సిటు ఏర్పాటు చేసి కేసును విచారిస్తున్నారు. 

Similar News