pension: పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. పంపిణీపై సర్కారు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ కీలకంగా మారిన అంశం పెన్షన్ల పంపిణీ.. అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షాలు పెన్షన్ల పంపిణీని రాజకీయానికి వాడుతున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Update: 2024-05-01 06:32 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ కీలకంగా మారిన అంశం పెన్షన్ల పంపిణీ.. అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షాలు పెన్షన్ల పంపిణీని రాజకీయానికి వాడుతున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ ఆలస్యమైంది. వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తూ.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్నికలు అయిపోయే వరకు వాళ్లను విధులకు దూరంగా ఉంచాలని కోర్టు తీర్పునిచ్చింది.

ఈ నేపథ్యంలో గత నెలలో పెన్షన్ లబ్ధిదారులను సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిందిగా అధికార పార్టీ సూచించింది. ప్రభుత్వం సూచన మేరకు చాలామంది లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లారు. అయితే సచివాలయం సిబ్బందికి ప్రభుత్వం పెన్షన్ డబ్బులను అప్పగించలేదు. దీనితో పెన్షన్ లబ్ధిదారులు గంటల తరబడి ఎండలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో ఎండ తీవ్రతకు కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు. కొంతమంది వృద్ధులు ప్రాణాలను కూడా కోల్పోయారనే కథనాలు వెలుగు చూశాయి. దీనితో అధికార పార్టీ ప్రతిపక్షాల కారణంగానే ఇలా జరిగిందని ఆరోపించింది. కాగా అధికార పార్టీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. సచివాలయం సిబ్బందిని, టీచర్లని ఉపయోగించుకొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయవచ్చని, కానీ ప్రతిపక్షాలను తప్పు పట్టేందుకే ప్రజలను సచివాలయాలకు రావలసిందిగా ప్రభుత్వం సూచించిందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.

అలానే ప్రజలను సచివాలయాలకు పిలిచి డబ్బులు ఇవ్వకుండా ప్రజలను ఎండలో వేచి చూసేలా అధికార పార్టీ పన్నాగం పన్నిందని, దీని కారణంగానే లబ్ధిదారులు ఇబ్బందులకు గురైయ్యారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అలానే సచివాలయాలకు ఉదయం 9 గంటలకు రావాల్సిందిగా లబ్ధిధారులకు పిలుపునిచ్చిన అధికార పార్టీ, ఎందుకు తొమ్మిది గంటలకు డబ్బులను పంపిణీ చేయలేక పోయింది అనే ప్రశ్నలు లేవనెత్తారు.

ఈ నేపథ్యంలో ఈ నెల పంపిణీ చేయాల్సిన పెన్షన్‌ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ లింక్ అయినటువంటి లబ్ధిదారులకు DBT ద్వార బ్యాంక్ అకౌంట్లో సచివాలయం సిబ్బంది పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారు. అలానే దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, వీల్‌చైర్‌కే పరిమితమైన వారికి, మంచానికే పరిమితమైన వారికి, వితంతువులకు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ బ్యాంకులో పెన్షన్ డబ్బులు పడని వారికి త్వరలోనే ఆ డబ్బులను బ్యాంకులో చెమ చేస్తారని ప్రభుత్వం తెలిపింది.


Similar News