ఆ అధికారులపై చంద్రబాబు సీరియస్ .. ఎందుకలా చేస్తున్నారంటూ ఆగ్రహం

పింఛన్ల వ్యవహారంలో కొందరు అధికారుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ..

Update: 2024-04-29 10:49 GMT

దిశ, వెబ్ డెస్క్: పింఛన్ల వ్యవహారంలో కొందరు అధికారుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నా ఇంటింటికి ఎందుకు పింఛన్లు ఇవ్వలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. వృద్ధుల పింఛన్లు బ్యాంకు ఖాతాలో వేస్తామనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎండలో వాళ్లను ఇబ్బంది పెట్టేలా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ కుట్రలు, కుతంత్రాలకు కొందరు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని తాము ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ చేసినట్లు గుర్తు చేశారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించాలని అటు ఎన్నికల సంఘం ఆదేశించినా రాష్ట్ర అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. కుంటి సాకులు చెప్పడం సబబు కాదన్నారు. ఒక పార్టీ, వ్యక్తి కోసం అధికారులు పని చేయడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. పింఛన్ లబ్ధిదారులు మళ్లీ ఎండలో చనిపోతే ఆ బాధ్యత జగన్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని, తప్పుడు రాజకీయాలు చేయొద్దని చంద్రబాబు సూచించారు.

కాగా వార్డు వాలంటీర్లతో పింఛన్ లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయొద్దన్న ఈసీ ఆదేశాలతో గత నెలలో గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేశారు. అయితే ఎండల తీవ్రతలో రాష్ట్రంలో చాలా చోట్ల వృద్ధులు మృతి చెందారు. దీంతో మే నెలలో కూడా వార్డు సచివాలయాల వద్దే పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఈసీని కలిశాయి. వృద్ధులు, వికలాంగులు, వితంతవులు, తదితరులకు ఇంటివద్దనే పింఛన్లు అందజేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీంతో లబ్ధిదారులకు ఇంటివద్దనే ఫించన్లు  పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. అయితే లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్లు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఖాతాలు లేని వారికి వార్డు సచివాలయాల వద్ద నగదు అందజేస్తామని చెప్పింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకులు తప్పు బట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది అందుబాటులో ఉన్నా ఎందుకు పింఛన్లు పంపిణీ చేయరని ప్రశ్నించారు. మాజీ సీఎం చంద్రబాబు సైతం లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కోడూమూరు ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు.

Read More..

షర్మిల, సీఎం రేవంత్ రెడ్డి పై జగన్ సంచలన వ్యాఖ్యలు 

Tags:    

Similar News