బీటెక్ రవికి షాక్: రిమాండ్ పొడిగించిన కడప మెజిస్ట్రేట్ కోర్టు
మాజీ ఎమ్మెల్సీ,పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవికి కడప మెజిస్ట్రేట్ కోర్టులో చుక్కెదురైంది.
దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ ఎమ్మెల్సీ,పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవికి కడప మెజిస్ట్రేట్ కోర్టులో చుక్కెదురైంది. బీటెక్ రవి జ్యుడీషియల్ రిమాండ్‌ను మరో 14 రోజులపాటు కోర్టు పొడిగించింది. డిసెంబర్ 11 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. దీంతో పులివెందుల రవిని కడప మెజిస్ట్రేట్ కోర్టు నుంచి కడప జైలుకు తరలించారు. కడప విమానాశ్రయం దగ్గర పోలీసులతో జరిగిన వాగ్వాదంపై కేసులో బీటెక్ రవిని ఈ నెల 14న వల్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కడప జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా జనవరి 25న బీటెక్ రవి కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శించారు. అనంతరం యువగళం పాదయాత్రలో భాగంగా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు బీటెక్ రవి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి విమానాశ్రయకు వెళ్లారు. అయితే విమానాశ్రయంలో పలికి వెళ్లేందుకు బీటెక్ రవి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీటెక్ రవి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పది నెలల అనంతరం బీటెక్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తోంది. పులివెందులలో బీటెక్ రవి రోజు రోజుకు బలపడుతుండటాన్ని తట్టుకోలేకపోయిన వైసీపీ కావాలనే అక్రమ కేసులు పెట్టి జైలుపాల్జేసిందని టీడీపీ ఆరోపణలు చేసింది.