నాలుగు రోజుల్లో రిటైర్మెంట్.. ఇంకా పోరాటం..!

సీనియర్ ఐపీఎస్, డీజీ కేడర్‌లో ఉన్న ఏబీ వెంకటేశ్వరావు పోస్టింగ్ విషయంలో సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది..

Update: 2024-05-26 13:04 GMT

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ ఐపీఎస్, డీజీ కేడర్‌లో ఉన్న ఏబీ వెంకటేశ్వరావు పోస్టింగ్ విషయంలో సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఆయన మరో 4 రోజుల్లో రిటైర్మెంట్ కావాల్సి ఉంది. అయినా సరే ఆయన ఉద్యోగంలో చేరి సేవ చేయాలని గట్టిగా పోరాడుతున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారు. నిఘా పరికాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఆయనపై వేటు వేశారు. దీంతో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు పోరాటం చేశారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. క్యాట్ తీర్పు రద్దు చేయాలని కోరింది. ఇరువర్గాల వాదన విన్న హైకోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది. అయితే ఏబీ వెంకటేశ్వరరావు ఉద్యోగ మిరమణ గడువు ఆసన్నమైంది. మరో నాలుగు రోజుల్లో రిటైర్మెంట్ కావాల్సింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు పోస్టింగ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. తను రిటైర్మెంట్ అయ్యే లోపు మళ్లీ ఒక్క రోజైనా విధులు నిర్వహించాలని ఏబీ పట్టుమీద ఉన్నారు. యూనిఫాంతో పోస్టింగ్‌లో ఉండి రిటైర్ కావాలని భావిస్తున్నారు. అటు పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం మాత్రం సుముఖంగా లేదు. దీంతో హైకోర్టు ఇచ్చే ఆదేశాలకోసం ఏబీ వెంకటేశ్వరరావు ఎదురు చూస్తున్నారు. మరి కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుంది. మళ్లీ పోస్టింగ్‌లో సేవలు అందించాలన్న ఏబీ కోరిక తీరుతుందా అనేది చూడాల్సి ఉంది.  

Similar News