పట్టించుకోని అధికార యంత్రాంగం.. రూ.1.80 కోట్లు వృథా..

రోగులకు సేవలందించాల్సిన ఆస్పత్రి వైద్యులు మిన్నకుండిపోవాల్సి వస్తోంది.

Update: 2024-05-26 04:34 GMT

దిశ ప్రతినిధి, అనకాపల్లి: రోగులకు సేవలందించాల్సిన ఆస్పత్రి వైద్యులు మిన్నకుండిపోవాల్సి వస్తోంది. సాక్షాతూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటన కాగితాలకే పరిమితమైపోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాతలు ఇచ్చే నిధులు, సమకూర్చే యంత్రాలూ మూలకు చేరిపోయాయి. మొత్తంగా అనకాపల్లి జిల్లా రోగులకు ప్రధాన ఆస్పత్రి అయిన ఎన్టీఆర్ వైద్యాలయంలో ఇక్కట్లు తప్పడం లేదు.

సుమారు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే సీటీ స్కాన్ యంత్రం ఉన్నా వైద్య పరీక్షలను నిర్వహించకపోవడలతో రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పేదలంతా ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది.

అట్టహాసంగా సీటీ స్కాన్ యంత్రం ప్రారంభం

జిల్లా కేంద్రమైన అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి ఆరు నెలల కిందట ఆదానీ గ్రూపు సంస్థ సామాజిక బాధ్యత నిధులను వెచ్చించి రూ.1.80 కోట్లతో ఇక్కడ సీటీ స్కాన్ యంత్రాన్ని కొనుగోలు చేసి ఏర్పాటు చేసింది. ఈ యంత్రాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి , సంబంధిత అధికారులు అట్టహాసంగా ప్రారంభించారు.

సీటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించిన అనంతరం అమర్నాథ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 15 రోజుల్లో యంత్రం రోగులకు అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతో పేదలంతా సంతోషం వ్యక్తం చేశారు.

అందుబాటులోకి వచ్చేదెప్పుడో?

అయితే నెలలు గడుస్తున్నా, ఇప్పటి వరకు ఆ యంత్రం అందుబాటులోకి రాకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు. విచిత్రం ఏమంటే ఈ యంత్రం ఉన్న గదిని కూడా ఇప్పటి వరకూ తెరవనే లేదు. సీటీ స్కాన్ యంత్రం ఎప్పుడు పనిచేస్తుంది? తమ ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయా అని రోగులు ఎదురు చూస్తున్నారు.

రెండు కోట్ల రూపాయల విలువైన సిటీ స్కాన్ అందుబాటులో ఉన్నా, లక్షల ఖర్చుతో దాన్ని వినియోగంలోకి తీసుకురాకుండా వైద్య విధాన పరిషత్ కాలక్షేపం చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత అయినా దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అనకాపల్లి వాసులు కోరుతున్నారు.

Similar News