పొలంలో పార్టీల గుర్తులు..ఎన్డీయే కూటమికి వినూత్నంగా రైతుల మద్దతు

ఏపీలో ఎన్నికలకు రెండు రోజులు మాత్రమే ఉంది. రేపటితో ప్రచార గడువు కూడా ముగుస్తుంది. దీంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.

Update: 2024-05-10 11:33 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలకు రెండు రోజులు మాత్రమే ఉంది. రేపటితో ప్రచార గడువు కూడా ముగుస్తుంది. దీంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కూటమి విజయం సాధించాలని గుంటూరు జిల్లా రైతులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. వివరాల్లోకి వేళితే..కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో కౌలు రైతులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గుర్తులను పంటపొలాల్లో చిత్రించారు. గోంగూర నారు మడితో సైకిల్, గాజు గ్లాసు, కమలం గుర్తులను రూపొందించారు. ‘ప్రతి చేతికి పని- ప్రతి చేనుకు నీరు’ అనే కూటమి నినాదాన్ని కూడా అందులో పొందుపర్చారు.

కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ చేసిన సాయాన్ని రైతులు ఎవరూ మర్చిపోరని కౌలు రైతు ఎర్రి పాపారావు అన్నారు. గుంటూరులో గోంగూరకు ఎంతో పేరుంది అని తెలిపారు. అందుకే గోంగూర విత్తనాలను ఎన్డీయే గుర్తుల రూపంలో చల్లి, ఆ నారు వచ్చిన తర్వాత అందరినీ ఆకట్టుకునేలా చేశామన్నారు. ఈ ఎన్నికల్లో రైతుల ప్రయోజనాలు కాపాడే కూటమికి తన వంతు సాయంగా ప్రచారం చేస్తామని సంకల్పంతో కూటమి గుర్తులను రూపొందించినట్లు కౌలు రైతు ఎర్రి పాపారావు తెలిపారు. ఈక్రమంలో ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా కూటమికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ప్రజెంట్ ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News