మాది పిట్టలపార్టీయే మీది రాబందుల పార్టీ : బీజేపీ ఎంపీపై బీవీ రాఘవులు

బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వామపక్షాలను పిట్టలతో పోల్చడంపై సీపీఎం పార్టీ నేత బీవీ రాఘవులు కౌంటర్ ఇచ్చారు.

Update: 2023-11-23 12:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వామపక్షాలను పిట్టలతో పోల్చడంపై సీపీఎం పార్టీ నేత బీవీ రాఘవులు కౌంటర్ ఇచ్చారు. మాది పిట్టల పార్టీ అయితే బీజేపీ రాబందుల పార్టీ అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పిట్టలంటే అందరికీ గౌరవమని.. మమ్మల్ని పిట్టలతో పోల్చినందుకు జీవీఎల్‌కు ధన్యావాదలు అని అన్నారు. పిట్టలు లేకుంటే అసలు పర్యావరణమే లేదనేది వారు తెలుసుకోవాలని సూచించారు. తాము ప్రజల కోసం పని చేస్తామని, వారు పెట్టుబడిదారుల కోసం పని చేస్తారంటూ విమర్శించారు. పిట్టలు సమాజానికి మేలు చేస్తాయని, రాబందులకు పీక్కుతినడం, నాశనం చేయడం తప్ప మరొకటి తెలియదని అన్నారు. తమ వల్ల ప్రజలకు మేలు జరిగితే వాళ్ల వల్ల అన్యాయం జరుగుతోందని ఇది అందరికీ తెలుసునన్నారు. విజయవాడలో బీవీ రాఘవులు మీడియాతో మాట్లాడారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించి, కిషన్ రెడ్డిని ఎందుకు పెట్టారని బీవీ రాఘవులు ప్రశ్నించారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాలలో వాళ్ల పార్టీ నాయకులను ఎందుకు మార్చారని నిలదీశారు. వాళ్ల సంగతి వాళ్లు తెలుసుకుని ప్రజల ఆదరణ పొందితే మేలని సూచించారు. వైరుధ్యాలు ఉన్నా అనేక పార్టీలు కలిసి ఇండియాగా ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. మతోన్మాదాన్ని తరిమికొట్టేందుకు ఇండియా పని చేస్తోందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని ఓడించేలా ముందుకు సాగుతామన్న ఆయన సీపీఐ, సీపీఎంలు శాసన సభకు వెళ్లాలని ఎవరికి వారుగా పోటీ చేస్తున్నామని బీవీ రాఘవులు వెల్లడించారు.

Tags:    

Similar News