Pawan Kalyanను సీఎం చేయడమే లక్ష్యం...సిడ్నీలో Nagababu కీలక ప్రసంగం

వృత్తి, వ్యాపారాల రీత్యా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో దూరంగా స్థిరపడ్డప్పటికీ తెలుగు జాతి ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవటం కోసం అందరం దగ్గరై పని చేద్దామని జనసేన పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు...

Update: 2023-03-12 13:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వృత్తి, వ్యాపారాల రీత్యా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో దూరంగా స్థిరపడ్డప్పటికీ తెలుగు జాతి ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవటం కోసం అందరం దగ్గరై పని చేద్దామని జనసేన పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా ఆదివారం సిడ్నీలో నిర్వహించిన ప్రవాస భారతీయుల చర్చావేదికపై నాగబాబు కీలక ప్రసంగం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే పని చేసే జనసేన పార్టీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో స్థిరపడిన వారు అనేక మంది మద్దతు తెలపడం శుభపరిణామం అని అన్నారు.

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తోన్న ప్రతీ జన సైనికులు, వీర మహిళలకు నాగబాబు ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభద్రతా భావం పెరిగి పోతున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధికారంలోకి రావాల్సిన అటువంటి ఆవశ్యకతను గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడమే ప్రధాన ధ్యేయంగా పని చేయాలని నాగబాబు పిలుపునిచ్చారు.

జనసేనకు మద్దతు పలికిన ప్రవాస భారతీయులు

మరోవైపు మెల్ బోర్న్ నగరంలో మేధావులు, వ్యాపారస్తులు, స్థానిక రాజకీయ నాయకులు, పలు వ్యాపార, సామాజిక సంస్థల యాజమాన్యాలతో జరిగిన మేథో మథనంలో నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేశారు. భారతదేశ రాజకీయ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ అనిశ్చితిపై చర్చించారు. ఈ మేథోమథనంలో జనసేన బలోపేతానికి పలువురు మద్దతు తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం కోసం అవసరమైతే స్వదేశానికి వచ్చి పని చేస్తామని హామీ ఇచ్చారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన జన సైనికులు, వీర మహిళలు సమిష్టిగా ఆయా ప్రధాన నగరాల్లో నిర్విరామంగా నిర్వహిస్తోన్న సభలు, సమావేశాలు, చర్చావేదికల్లో నాగబాబు ముఖ్యఅతిథిగా పాల్గొంటూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తున్నారు. నాగబాబు వెంట జనసేన నాయకులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, హైపర్ ఆది తదితరులు ఉన్నారు

Tags:    

Similar News