Janasena: పవన్ కల్యాణ్ సభ కోసం 34 ఎకరాల భూమి ఇచ్చిన రైతులు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకత్వం అడుగులు వేస్తోంది...

Update: 2023-03-01 13:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకత్వం అడుగులు వేస్తోంది. 2014 మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఈ మార్చి 14తో 8 ఏళ్లు పూర్తి అయి 9వ ఏటలోకి ప్రవేశించనుంది. దీంతో పార్టీ ఆవిర్భావాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వచ్చేది ఎన్నికల సమయం కావడంతో ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ చేసే ప్రసంగం పార్టీ దశ, దిశను తెలియజేసేలా ఉంటుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి.

మచిలీపట్నంలో జనసేన  ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

ఇందులో భాగంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈసారి ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించాలని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించేందుకు ఆ ప్రాంతానికి చెందిన రైతులు 34 ఎకరాల భూమిని అప్పగించినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మచిలీపట్నం సభకు అధినేత పవన్ కల్యాణ్ సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహి వాహనంపై సభా వేదిక వద్దకు చేరుకుంటారని వెల్లడించారు. దారి పొడవునా ప్రజల సమస్యలను పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకుంటారని తెలిపారు. అనంతరం సభావేదిక నుంచి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాల్లో మార్పు కోసం దిశానిర్దేశం చేస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Tags:    

Similar News