Vangaveeti Ranga పేరు పెట్టండి.. రాజ్యసభలో జీవీఎల్ డిమాండ్

రాష్ట్రంలో ఒక జిల్లాకు, విజయవాడ విమానాశ్రయానికి దివంగత వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. సోమవారం రాజ్యసభలో జీరో అవర్లో దివంగత వంగవీటి మోహనరంగా గురించి జీవీఎల్ ప్రస్తావించారు....

Update: 2023-02-13 11:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఒక జిల్లాకు, విజయవాడ విమానాశ్రయానికి దివంగత వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. సోమవారం రాజ్యసభలో జీరో అవర్లో దివంగత వంగవీటి మోహనరంగా గురించి జీవీఎల్ ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి మోహనరంగా తెలియని వారుండరని చెప్పారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు రంగాను దైవంగా కొలుస్తారని సభలో తెలిపారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి మోహన రంగా ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ గొప్ప ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. అలాంటి వంగవీటిని కొందరు ద్రోహులు 1986 డిసెంబర్ నెలలో హతమార్చారని సభలో గుర్తు చేశారు. రాష్ట్రంలో రాజకీయ శక్తిగా ఎదుగుతున్న తరుణంలో దారుణానికి పాల్పడ్డారని అన్నారు.

36 ఏళ్లు అవుతున్నా..

'కాపునాడు' సభలను నిర్వహిస్తున్న సమయంలో హత్య జరిగిందని జీవీఎల్ గుర్తు చేశారు. రంగా చనిపోయి 36 ఏళ్లు అవుతున్నా నేటికి తెలుగు రాష్ట్రాల ప్రజలు స్మరించుకుంటున్నారని కొనియాడారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కోరారు. ముఖ్యంగా కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకు రంగా పేరు పెట్టాలని.. అలాగే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రంగా పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇకపోతే కృష్ణా జిల్లాకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు పెట్టింది. అయినప్పటికీ కృష్ణా జిల్లాకు రంగా పేరుపెట్టాలని ప్రస్తావించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News