అలా చేస్తాడని అనుకోలేదు.. వల్లభనేని వంశీపై పవన్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో మద్యం, గంజాయి అమ్మించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని, అటువంటి వ్యక్తి యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వలేడని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు....

Update: 2024-05-08 13:40 GMT

దిశ, హనుమాన్ జంక్షన్: రాష్ట్రంలో మద్యం, గంజాయి అమ్మించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని, అటువంటి వ్యక్తి యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వలేడని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో బుధవారం నిర్వహించిన ‘వారాహి జనభేరి’ యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు దిగజారిపోయాయని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలపై జగన్ దాడులు చేశారన్నారు. రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు ఉండాలని, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదన్నారు. వైసీపీ పరిపాలనలో నీచ రాజకీయాలు చేయలేక, ఆత్మగౌరవం చంపుకోలేక జగన్మోహన్ రెడ్డిని వదిలి చాలా మంది బయటకు వెళ్లిపోయారన్నారు. అటువంటి వారిలో మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, గన్నవరం అసెంబ్లీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారన్నారు. విద్యా, వైద్యం, సాగునీరే లక్ష్యంగా 2014 ఎన్నికల్లో కలిసి పని చేశామని, మరోసారి రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ అందరం ఉమ్మడి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళుతున్నామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని, ఆ పార్టీ నేతలు ఇచ్చే 2000కి లొంగితే భవిష్యత్తు పాడు చేసుకున్న వాళ్ళమవుతామని హెచ్చరించారు.


మహిళల రక్షణకు కఠిన చట్టాలు ఎంతో అవసరమని అందుకు అనుగుణంగా చట్టాల అమలకు చర్యలు చేపట్టాలని, రానున్న ఉమ్మడి కూటమి హయాంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండు జోడు గుర్రాలంటూ వ్యాఖ్యానించిన పవన్ అభివృద్ధి ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలను సజావుగా అమలు చేయగలమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గన్నవరం నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. జనసేన పోటీ లేని స్థానాల్లో తమకు ఓటు వేయమని కొంతమంది వైసీపీ నాయకులు కోరుతున్నారని, గన్నవరంలో సైతం వైసీపీ అభ్యర్థి వంశీ ఎమ్మెల్యే ఓటు తనకు వేయాలని, ఎంపీ ఓటు జనసేన వేయాలంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అలాంటి వారి మాటలు నమ్మి ఆ పార్టీకి ఓటు వేస్తే ఉమ్మడి కూటమికి ద్రోహం చేసినట్లే అన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ రాష్ట్ర అసెంబ్లీలో నారా భువనేశ్వర్‌ని తప్పుగా మాట్లాడారని గుర్తు చేశారు. భువనేశ్వరి నా సోదరి లాంటిదన్న పవన్.. వంశీని ఓడించాలని పిలుపు నిచ్చారు. 2014 ఎన్నికల్లో వంశీ విజయానికి జనసేన కార్యకర్తలు సహకరించారని, ఆనాడు వంశీనే చెప్పారని, గెలిచిన తర్వాత ఇలాంటి పని చేస్తాడని తాను ఊహించలేదన్నారు. వంశీని ఓడించి యార్లగడ్డను గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.

కాల్ మనీ కేసుల్లో జైలు చుట్టూ తిరిగే వ్యక్తులకు దేవాలయ చైర్మన్ పదవిని కట్టబెట్టారని, హిందూ సంప్రదాయాలను గౌరవించని వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి తీసుకు రాకూడదని పవన్ పిలుపునిచ్చారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో పరిశ్రమలు పెట్టాలంటే ఎమ్మెల్యే‌కు ఎందుకు డబ్బులు ఇవ్వాలని పవన్ ప్రశ్నించారు. మల్లవల్లి భూనిర్వాసితులకు పరిహారం అందజేస్తామని భరోసా కల్పించారు.

ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ వెంట మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి, గన్నవరం, నూజివీడు, దెందులూరు, పెనమలూరు అసెంబ్లీ అభ్యర్థులు యార్లగడ్డ వెంకట్రావు, కోలుసు పార్థసారథి, చింతమనేని ప్రభాకర్, బోడె ప్రసాద్, మచిలీపట్నం పార్లమెంటు మాజీ సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు, జిల్లా పార్టీ జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయ కర్త చలమలశేట్టి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Read More...

‘జనసేన’ పార్టీ కోసం పాట పాడిన సురేష్ కొండేటీ (వీడియో).. ఆ నాలుగు ఓట్లు కూడా పడేలా లేవంటూ ట్రోల్స్ 

Tags:    

Similar News