AP News:పేదల భవిష్యత్తుకు పునాదులు వేసింది సీఎం జగన్‌:మంత్రి రజిని

రాష్ట్రంలో పేదల బంగారు భవిష్యత్తుకు ఈ ఐదేళ్లలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి గట్టి పునాదులు వేశారని, మరొక్క అవకాశం ఇస్తే ఆ పునాదుల మీద బహుళ అంతస్తుల సౌధాన్ని నిర్మిస్తారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, వైసీపీ గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజిని అన్నారు

Update: 2024-04-25 14:22 GMT

దిశ ప్రతినిధి,గుంటూరు: రాష్ట్రంలో పేదల బంగారు భవిష్యత్తుకు ఈ ఐదేళ్లలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి గట్టి పునాదులు వేశారని, మరొక్క అవకాశం ఇస్తే ఆ పునాదుల మీద బహుళ అంతస్తుల సౌధాన్ని నిర్మిస్తారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, వైసీపీ గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజిని అన్నారు. గుంటూరు నగరంలోని 35, 20వ డివిజన్లలో గురువారం జరిగిన మనతో మన రజనమ్మ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నవరత్నాలతో ఓ పక్క పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తూనే మరోపక్క ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేశారని, పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి తెచ్చారని, పేదలందరికీ ఇళ్ల స్థలాలిచ్చి, ఇళ్లు కట్టించి ఇస్తున్నారన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో పేదల జీవన ప్రమాణాలు పెంపునకు జగన్‌ గట్టి పునాదులు వేశారని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే నిదర్శనమని చెప్పారు. పేదల అభ్యున్నతి గిట్టని ప్రతిపక్షాలు జగనన్న వేసిన పునాదులు కూల్చేయాలని చూస్తున్నాయని, అందులో భాగంగానే పెత్తందారీ పార్టీలన్నీ ఒక్కటయ్యాయి అన్నారు.

రానున్న ఎన్నికల్లో పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమని, ఈ యుద్ధంలో పేదలంతా జగనన్నకు మద్దతు ఇవ్వాలని కోరారు. వైసీపీ గుంటూరు నగర అధ్యక్షుడు మద్దాళి గిరి మాట్లాడుతూ కుల,మత, పార్టీలకతీతంగా అందరి సంక్షేమం కోరుకునే మంచి మనసున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని అన్నారు. జగనన్నను మరోసారి సీఎం చేస్తే పేదలకు మరింత మంచి జరుగుతుందన్నారు. గుంటూరు వెస్ట్‌లో ఎమ్మెల్యేగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మంత్రి విడదల రజనికి, గుంటూరు ఎంపీగా కిలారి రోశయ్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Similar News