ఏపీలో త్వరలో విద్యుత్ చార్జీల పెంపు..యూనిట్‌పై రూ.1.15 వడ్డన: బొండా ఉమా మహేశ్వరావు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ నేటివరకు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై తన బాదుడేబాదుడిని వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు.

Update: 2023-10-19 12:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ నేటివరకు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై తన బాదుడేబాదుడిని వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. వరుసబాదుడులతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారనే ఇంగితం కూడా లేకుండా తాజాగా ఏపీఈఆర్సీకి మరో రూ.7,200కోట్ల వరకు ప్రతిపాదనలు పంపాడని, యూనిట్ కు అదనంగా మరో రూ.1.15పైసలు పెంచేందుకు సిద్ధమయ్యాడని బొండా ఉమా ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బొండా ఉమా గురువారం మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ సీఎం అయినప్పటినుంచీ నేటివరకు అంటే నాలుగున్న రేళ్లలోనే వివిధరూపాల్లో ప్రజలపై రూ.64,388 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపాడు అని ఆరోపించారు. చంద్రబాబునాయుడు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా గతంలో ఏనాడూ ప్రజలపై పైసా భారం మోపిందిలేదు. ప్రజలపై భారం వేయకుండా వారికి నాణ్యమైన విద్యుత్ ను కోతలు లేకుండా అందించి, రాష్ట్రాన్ని కూడా మిగులు విద్యుత్ ఉత్పత్తిలో నిలిపాడు అని గుర్తు చేశారు. ఏపీ ప్రజలకు దసరా పండుగ కానుకగా జగన్ రెడ్డి ఒక్కో యూనిట్ కు అదనంగా రూ.1.15 పైసలు పెంచబోతున్నాడు అని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి దసరా మామూళ్లు కొట్టేస్తూ, ప్రజలకు మాత్రం దమ్మిడీ మిగలకుండా చేస్తున్నాడు అని మండిపడ్డారు. తన అవినీతికోసం కమీషన్ల కక్కుర్తితో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని కూడా జగన్ రెడ్డి పూర్తి గా భ్రష్టుపట్టించాడు అని బొండా ఉమా ఆరోపించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.36,261కోట్ల అప్పులు తెచ్చిన జగన్ రెడ్డి, హిందుజా సంస్థకు చెల్లించాలంటూ మరో రూ.2,834 కోట్ల అప్పులు తెచ్చాడు అని మండిపడ్డారు. డిస్కంలకు వైసీపీ ప్రభుత్వం రూ.34,776 కోట్లు బకాయిపెట్టిందని... దాంతో విద్యుత్ డిస్కంలు నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు రాక, పవర్ ఫైనాస్స్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చిమరీ జగన్ సర్కార్ తన స్వార్థానికి వాడుకోవడంతో డిస్కంల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది అని బొండా ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు.

రూ.22వేల కోట్లు కొట్టేసిన జగన్

బినామీ సంస్థలకు దోచిపెట్టడానికి, తన అప్పులకోసం డిస్కంలకు జగన్ రెడ్డి రూ.34,776 కోట్లు బకాయి పెట్టాడు అని బొండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటు ప్రజల్ని, ఇటు డిస్కంలను దెబ్బతీస్తూ, రాష్ట్ర విద్యుత్ రంగాన్నే నామరూపాలు లేకుండా చేసింది అని మండిపడ్డారు. కేవలం తన కమీషన్ల కోసమే జగన్ రెడ్డి ఒక్కో యూనిట్ కు రూ.4.02పైసలు అదనంగా చెల్లించి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొంటున్నాడు అని ధ్వజమెత్తారు. బయటమార్కెట్లో అధికధరకు విద్యుత్ కొని, సెకీ ఒప్పందాల ద్వారా జగన్ రెడ్డి రూ.22 వేల కోట్లు కొట్టేశాడు అని ఆరోపించారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నా జగన్ ప్రభుత్వంలో చలనంలేదు అని మండిపడ్డారు.అధికారంలోకి వస్తే అన్ని వ్యవస్థల్ని రక్షిస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యి నాలుగున్నరేళ్లు అవుతున్నా నేటికీ గతప్రభుత్వంపైనే నింద లేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు అని బొండా ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రూపాయి విద్యుత్ ఛార్జీ పెంచకుండా ప్రజలకు మేలు చేస్తే, అప్పుడు లేని ట్రూ అప్ ఛార్జీలు, ఫ్యూయెల్ అడ్జస్ట్ మెంట్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు జగన్ రెడ్డి వచ్చాకే ఎందుకు తెరపైకి వచ్చాయి? జగన్ రెడ్డి అంతులేని అవినీతికి అంతిమంగా రాష్ట్రమే బలికానుంది. జగన్ రెడ్డి విద్యుత్ రంగాన్ని తన ఆదాయవనరుగా మార్చు కున్నందునే నేడు రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

Tags:    

Similar News