అనపర్తి టికెట్‍పై తొలగిన ఉత్కంఠ.. నల్లమిల్లిని ఒప్పించిన చంద్రబాబు

కొంతకాలంగా పీటముడి పడిన అనపర్తి సీటుపై సందిగ్ధత తొలగనుంది....

Update: 2024-04-21 17:29 GMT

దిశ, ఉభయగోదావరి జిల్లా ప్రతినిధి: కొంతకాలంగా పీటముడి పడిన అనపర్తి సీటుపై సంధిగ్ధత తొలగనుంది. తొలి జాబితాలో అనపర్తి అసెంబ్లీకి టిడిపి నుండి సీటు దక్కని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తితో గత కొంతకాలంగా అనపర్తిలో "ఇంటింటికి నల్లమిల్లి" పేరిట పాదయాత్రలు నిర్వహించారు. పొత్తుల్లో భాగంగా అనపర్తి బిజెపికి కేటాయించడంతో నల్లమిల్లికి సీట్ లేకుండా పోయింది. వాస్తవానికి నల్లమిల్లికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నా, పొత్తు ధర్మం ప్రకారం సాధ్యం కాలేదు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అనపర్తి గెలుపు అవకాశాలను నిర్ణయించేలా ఉండడంతో బిజెపి కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది.

నల్లమిల్లికి టిడిపి నుండి టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆయనను బిజెపి కండువా ద్వారా అవకాశం కల్పించేలా నిర్ణయించారు. తొలుత నల్లమిల్లి బిజెపి కండువా కప్పుకోవడానికి ఒప్పుకోక పోవడంతో పార్టీ అధినేత చంద్రబాబు,బుచ్చయ్య చౌదరిలు సాధ్యాసాధ్యా లను వివరించడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. త్వరలో బీజేపీలో చేరనున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రామవరంలో బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు.

Similar News