ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక కేంద్రమే దిక్కు!

భజన అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. నాటి టీడీపీ ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా ఉన్న విభజన హామీలు సాధించలేకపోయింది. రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయాన్ని జీఎస్టీ పేరుతో కేంద్రం మింగేస్తోంది.

Update: 2024-05-26 02:32 GMT

దిశ, ఏపీ బ్యూరో: విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. నాటి టీడీపీ ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా ఉన్న విభజన హామీలు సాధించలేకపోయింది. రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయాన్ని జీఎస్టీ పేరుతో కేంద్రం మింగేస్తోంది. తిరిగి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాలో కొర్రీలు వేస్తూ వచ్చింది. రెవెన్యూ లోటును కుదించి ఇటీవలనే కొంత విడుదల చేసింది. ప్రత్యేక హోదాను అటకెక్కించింది. పెట్రోల్, డీజిల్​ పై రెండున్నర రెట్లు ఎక్సైజ్​ సుంకం, సెస్​లను బాదేస్తోంది. వంట గ్యాస్​ ధరలు పెంచుకుంటూ వెళ్లింది. చివరకు నిత్యావసరాలపైనా జీఎస్టీ విధిస్తోంది. విద్యుత్​ సంస్కరణల పేరిట ప్రజల మూలిగలు పీల్చేస్తుంది. అయినా నాడు టీడీపీ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండిపోయింది.

సాగిలపడిన వైసీపీ సర్కారు..

2019లో అధికారానికి వచ్చిన వైసీపీ సర్కారు టీడీపీ ప్రభుత్వాన్ని తలదన్నే రీతిలో కేంద్రానికి సాష్టాంగపడింది. అర్బన్​ సంస్కరణల పేరిట ఆస్తి, ఇంటి పన్నులను పెంచింది. గృహ అవసరాలకు వినియోగించే నీటిక్కూడా మీటర్లు బిగించింది. రేపోమాపో వ్యవసాయానికి ఉచిత విద్యుత్​కు మంగళం పాడేందుకు పంపుసెట్లకు మీటర్లు బిగించింది. మొత్తం విద్యుత్​ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు అడుగులు వేసింది. కేంద్రం నుంచి ఒక్క ఎయిమ్స్​ తప్ప మరే ప్రాజెక్టులను సాధించలేకపోయింది.

కేంద్రం కబంధ హస్తాల్లో..

విశాఖ, విజయవాడ మెట్రో ఊసే లేదు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు. విశాఖ –కాకినాడ పెట్రో కారిడార్​ను పూర్తిగా మర్చిపోయారు. రామాయపట్నం మేజర్​ పోర్టును కుదించి ప్రైవేటు రంగంలో మైనర్​ పోర్టు గా మార్చేశారు. కడప ఉక్కు పరిశ్రమకు బదులు జిందాల్​ స్టీల్​ను తీసుకొచ్చారు. చివరకు విశాఖ రైల్వే జోన్​కు సైతం మోక్షం కలగలేదు. ఇలా కేంద్రం ఎలాంటి సహకారం అందించకపోగా ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు విధించింది. రాష్ట్రాన్ని పూర్తిగా తన కబంధ హస్తాల్లో ఇరికించుకుంది.

ఇండియా కూటమి గెలిస్తేనే..

ఈ దఫా కేంద్రంలో ఏ కూటమి అధికారానికి వచ్చినా రాష్ట్రంపై పూర్తి స్థాయిలో అధికారాన్ని చెలాయించే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు జరిగిన పోలింగ్​ అన్ని దశల్లోనూ ఎన్డీయే బలహీన పడినట్లు ప్రముఖ సెఫాలజిస్టు యోగేంద్ర యాదవ్​ వెల్లడించారు. ఎన్డీయే కూటమి 200 స్థానాలకు పరిమితం కావొచ్చని చెబుతున్నారు. కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారాన్ని చేజిక్కించుకోవచ్చని కొన్ని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. ఇండియా కూటమి కేంద్రంలో అధికారానికి వస్తే రాష్ట్రాలు స్వయం సమృద్ధిగా ఎదిగేందుకు దోహదపడతామని రాహుల్​ గాంధీ హామీనిచ్చారు. జీఎస్టీ కౌన్సిల్​ను రద్దు చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని భరోసానిచ్చారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఇండియా కూటమి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని విపక్షాలు వెల్లడిస్తున్నాయి.

Similar News