బీజేపీ నెక్స్ట్ టార్గెట్ రాజస్థాన్?

దిశ, వెబ్‌డెస్క్: వృద్ధ నేతలను మార్గదర్శక మండలికి పంపించి.. యువతరానికి పొలిటికల్ స్కోప్ ఎక్కువగా ఇస్తూ బీజేపీ దూసుకుపోతున్నది. కానీ, కాంగ్రెస్ మాత్రం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ‘చేతులు’ కాల్చుకుంటున్నది. శ్రమించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు దోహదపడిన యువనేతలకు ఆశించిన స్థానాలను ఇవ్వకుండా కాంగ్రెస్ స్వయంకృతాపరాధం చేసుకుంటున్నది. సీనియర్లనే నమ్ముకుని.. యువనేతల శ్రమకు తగిన ఫలితమివ్వకుండా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నది. ఇందుకు తాజా ఉదాహరణే జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు. ఫలితంగా మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కారు కూలిపోయి కమలం […]

Update: 2020-03-11 06:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: వృద్ధ నేతలను మార్గదర్శక మండలికి పంపించి.. యువతరానికి పొలిటికల్ స్కోప్ ఎక్కువగా ఇస్తూ బీజేపీ దూసుకుపోతున్నది. కానీ, కాంగ్రెస్ మాత్రం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ‘చేతులు’ కాల్చుకుంటున్నది. శ్రమించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు దోహదపడిన యువనేతలకు ఆశించిన స్థానాలను ఇవ్వకుండా కాంగ్రెస్ స్వయంకృతాపరాధం చేసుకుంటున్నది. సీనియర్లనే నమ్ముకుని.. యువనేతల శ్రమకు తగిన ఫలితమివ్వకుండా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నది. ఇందుకు తాజా ఉదాహరణే జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు. ఫలితంగా మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కారు కూలిపోయి కమలం సర్కారు అధిరోహించే అవకాశం ఏర్పడింది. అయితే, ఈ తిరుగుబాటులు ఈ రాష్ట్రానికే పరిమితమవుతాయా? అంటే కాదనే అనిపిస్తున్నది. పక్కనే ఉన్న రాజస్థాన్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.

2018 చివరిలో జరిగిన మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని దింపి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకున్నది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో యువనేతలు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్లు కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ ఇద్దరే ఆ రెండు రాష్ట్రాలకు సీఎంలు అవుతారన్న విశ్లేషణలు వచ్చాయి. సింధియా, పైలట్‌లు కూడా అదే ఆశించారు. కానీ, కాంగ్రెస్ మాత్రం ఏరు దాటాక తెప్పతగలేసిన చందాన వారిని పక్కనపెట్టింది. అయితే, పైలట్‌ను డిప్యూటీ సీఎంగా చేసి రాష్ట్ర కాంగ్రెస్ విభాగానికి అధ్యక్షుడిని చేసింది. కాగా, సింధియాను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లి సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ప్రచారం చేయించింది కాంగ్రెస్. కానీ, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ డిజాస్టర్ కావడంతో సింధియాను పక్కనపెట్టేసింది.

అసెంబ్లీ ఎన్నికల నుంచే జూనియర్, సీనియర్ అనే తేడాలు ఆ రెండు రాష్ట్రాల కాంగ్రెస్ యూనిట్‌లలో ఎక్కువయ్యాయి. మధ్యప్రదేశ్‌లో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జ్యోతిరాదిత్య సింధియాకు, కమల్‌నాథ్‌కు మధ్య విభేదాలు పొడసూపాయి. రాజస్థాన్‌లోనూ సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ కలకలం రేపుతున్నారు. కోటాలోని ఓ ఆస్పత్రిలో చిన్నారుల మరణాలపై ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఘాటుగా మాట్లాడి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు.

ఈ నేపథ్యంలోనే జస్ట్ మిస్ అయిన మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని పొందేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. కాంగ్రెస్‌పై జ్యోతిరాదిత్య సింధియా అసంతృప్తి ఇప్పుడు బీజేపీకి కలిసొచ్చింది. ఇదే తరహాలో రాజస్తాన్‌లోనూ సచిన్ పైలట్ అసంతృప్తిని బీజేపీ క్యాష్ చేసుకునే అవకాశం లేకపోలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, మధ్యప్రదేశ్ కంటే రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ కొంచెం మెరుగ్గా ఉంది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్‌కు 112 సభ్యుల మద్దతు ఉన్నది. బీజేపీకి 80 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్నది.

Tags: congress, bjp, coup, madhya pradesh, rajastan, jyotiraditya scindia, sachin pilot

Tags:    

Similar News