ప్రధాని పదవికే మోడీ కళంకం : మంత్రి పొన్నం హాట్ కామెంట్స్

ప్రధానమంత్రి హోదాలో ఉండి నరేంద్ర మోడీ మాట్లాడే మాటలు ఆ పదవికే కళంకం తెచ్చే విధంగా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

Update: 2024-05-01 07:46 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ప్రధానమంత్రి హోదాలో ఉండి నరేంద్ర మోడీ మాట్లాడే మాటలు ఆ పదవికే కళంకం తెచ్చే విధంగా ఉన్నాయని రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలో పలుచోట్ల మేడే కార్మికుల దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు, సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం సిరిసిల్ల నేతన్న విగ్రహం వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో, జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై హాట్ కామెంట్స్ చేశారు.

మళ్లీ నరేంద్ర మోడీ ఆబ్ కీ బార్ చార్సావ్ (400) అంటున్నారని, బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లను తొలగించి, ఒక నియంతలా దేశాన్ని పాలించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏ ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాల ప్రజలు బీజేపీకి ఓటు వేసే పరిస్థితుల్లో లేరని తేల్చి చెప్పారు. ప్రధాని మోడీ సభల్లో మాట్లాడే మాటలతో బీజేపీ జనంలో బలహీన పడిపోతుందని, మోడీ ఒక కార్పొరేటర్ స్థాయికి దిగజారి పోయాడని ఎద్దేవా చేశారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తేవడం దేవుడెరుగు గానీ నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టిన బీజేపీకి ఓటు వేద్దామా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, గ్యారేజీకి వెళ్ళిన కారు రోడ్ ఎక్కడం కష్టమని, బీజేపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పక్క నాన్ లోకల్ క్యాండెట్ అని స్పష్టం చేశారు.

కేసీఆర్ రాజన్న ఆలయానికి ఏటా రూ.100 కోట్లు ఇస్తానని రాజన్నకే శఠగోపం పెట్టాడన్నారు. రాముని పేరు చెప్పి రాజకీయం చేస్తున్నారని, రామరాజ్యం తేవడానికి కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయమై ఉందన్నారు. కోట్ల రూపాయల ఆస్తులను అదానీ, అంబానీ కుటుంబాలకు కట్టబెట్టారని, మండల కమిషన్, కుల గణన సర్వేకు అడ్డు చెప్పింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అయిపోగానే నేతన్నల కోసం ఉజ్వలమైన ప్రణాళిక విడుదల చేస్తామని, పదేళ్ల వరకు నేత కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 3న సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన జాతర భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని, ఈ సభకు భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News