నాకు గాయమంటే ఎవరూ నమ్మలేదు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు

వన్డే వరల్డ్ కప్ తర్వాత తాను వెన్ను నొప్పితో తీవ్రంగా బాధపడ్డానని, అప్పుడు దాన్ని ఎవరూ నమ్మలేదని టీమ్ ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

Update: 2024-05-25 19:17 GMT

దిశ, స్పోర్ట్స్ : వన్డే వరల్డ్ కప్ తర్వాత తాను వెన్ను నొప్పితో తీవ్రంగా బాధపడ్డానని, అప్పుడు దాన్ని ఎవరూ నమ్మలేదని టీమ్ ఇండియా బ్యాటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఐపీఎల్-17లో భాగంగా కోల్‌కతా, హైదరాబాద్ జట్ల మధ్య ఆదివారం ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు శనివారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అయ్యర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘వన్డే వరల్డ్ కప్ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో నేను చాలా ఇబ్బంది పడ్డా. ఆ విషయాన్ని చెబితే ఎవరూ నమ్మలేదు. అదే సమయంలో నాతో నేనే పోటీ పడ్డా. ఐపీఎల్‌లో ఉత్తమ ప్రదర్శన చేయాలనుకున్నా.’ అని చెప్పాడు.

కాగా, రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్న కారణంగా శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఐపీఎల్‌కు ముందు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల అనంతరం అతను వెన్ను నొప్పితో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే, ఎన్‌సీఏలో బీసీసీఐ మెడికల్ టీమ్ అయ్యర్‌కు కొత్త గాయాలు ఏం లేవని బోర్డుకు లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. అలాగే, కేకేఆర్ ప్రీ సెషన్ క్యాంప్‌లో అతను పాల్గొన్నట్టు కథనాలు వెలువడ్డాయి. అదే సమయంలో అతను రంజీ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ అతనిపై వేటు వేసింది. 

Tags:    

Similar News