SRH VS RR : క్వాలిఫయర్-2లో గెలుపు ఎవరిది?. చెపాక్ స్టేడియంలో ఆ జట్టుదే ఆధిపత్యం

ఐపీఎల్-17లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది.

Update: 2024-05-23 19:50 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. క్వాలిఫయర్-1లో కోల్‌కతా చేతిలో ఓడిన ఆ జట్టుకు ఫైనల్ బెర్త్ దక్కించుకునేందుకు చివరి చాన్స్. నేడు క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. మరి, రాజస్థాన్‌ను దాటి హైదరాబాద్ టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుందో లేదో చూడాలి.

క్వాలిఫయర్-1లో హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. మరో ఫైనల్ బెర్త్ కోసం నేడు చెన్నయ్ వేదికగా హైదరాబాద్, రాజస్థాన్ జట్లు పోటీపడనున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్‌పరంగా ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తుండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ బ్యాటింగ్ బలం ప్రధానంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, క్లాసెన్‌ ప్రదర్శనలపైనే ఆధారపడి ఉన్నది. నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, కమిన్స్‌ కలిపి 8వ స్థానం వరకు బ్యాటింగ్ సామర్థ్యం ఉండటం బలంగా చెప్పుకోవచ్చు. కమిన్స్, నటరాజన్, భువనేశ్వర్‌లతో పేస్ దళం పటిష్టంగానే ఉంది. అయితే, చెపాక్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుందన్న నివేదికల నేపథ్యంలో జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం లోటే.

రాజస్థాన్‌తో అంత ఈజీ కాదు

ఎలిమినేటర్‌లో బెంగళూరుపై విజయంతో రాజస్థాన్ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ఆ జట్టు బలంగా ఉన్నది. కాబట్టి, ఆ జట్టును ఓడించడం హైదరాబాద్‌కు అంత తేలిక కాదు. జైశ్వాల్, శాంసన్, రియాన్ పరాగ్‌లకుతోడు ధ్రువ్ జురెల్, హెట్మేయర్, పావెల్‌లతో బ్యాటింగ్ దళం పటిష్టంగా ఉంది. వీరిని హైదరాబాద్ బౌలర్లు ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. మరోవైపు, అశ్విన్, చాహల్ స్పిన్ ద్వయాన్ని ఎదుర్కోవడం హైదరాబాద్ బ్యాటర్లకు సవాల్‌తో కూడుకున్నదే.

హైదరాబాద్ 10.. రాజస్థాన్ 9

ఐపీఎల్‌లో హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య ఇప్పటివరకు టఫ్ ఫైటే జరిగింది. ఇరు జట్లు 19సార్లు ఎదురుపడగా.. రాజస్థాన్ 9 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఎస్‌ఆర్‌హెచ్ 10 విజయాలు నమోదు చేసింది. ఈ సీజన్‌లో లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాదే నెగ్గింది. ఆ విజయంతోనే ముఖాముఖి పోరులో ఎస్‌ఆర్‌హెచ్ ఒక్క విజయంతో పైచేయి సాధించింది. ప్లే ఆఫ్స్ ఇరు జట్లు తలపడటం ఇది రెండోసారి. 2013లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో తొలిసారి ఎదురుపడగా అప్పుడు రాజస్థాన్ నెగ్గింది.

పిచ్ రిపోర్టు

చెపాక్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా అనుకూలించనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ పేసర్లతో పోలిస్తే స్పిన్నర్లు ఎక్కువగా ప్రభావం చూపనున్నారు. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఈ సీజన్‌లో ఈ స్టేడియంలో 7 మ్యాచ్‌లు జరగగా ఐదు మ్యాచ్‌ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది.

Tags:    

Similar News