103 ఏళ్ల వృద్ధుడికి ధోనీ స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?

ఎం.ఎస్ ధోనీకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-05-03 14:15 GMT

దిశ, స్పోర్ట్స్ : ఎం.ఎస్ ధోనీకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అతన్ని ఆరాధిస్తారు. తమిళనాడుకు చెందిన 103 ఏళ్ల వృద్ధుడు ఎస్.రామదాస్ కూడా ధోనీ, సీఎస్కేకు వీరాభిమాని. ఇటీవల రామదాస్‌కు సంబంధించి ఓ స్పెషల్ వీడియోను చెన్నయ్ ఫ్రాంచైజీ యూట్యూబ్‌లో పోస్టు చేసింది. తాజాగా రామదాస్‌కు ధోనీ స్పెషల్ గిఫ్ట్ పంపించాడు.

రామదాస్ పేరుతో సీఎస్కే ప్రత్యేకంగా ఓ జెర్సీని తయారు చేసింది. ఆయన వయసునే జెర్సీ నంబర్ ‘103’గా ముద్రించింది. ఆ జెర్సీపై ‘థ్యాంక్యూ తాత. ఫర్ ది సపోర్ట్’ అని ధోనీ రాశాడు. సంతకం కూడా చేశాడు. ఆ జెర్సీని రామదాస్‌కు పంపించగా.. ఆయన ఆనందానికి అవధుల్లేవు. జెర్సీని చూస్తూ సంబరపడిపోయారు.ఈ వీడియోను చెన్నయ్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది.

కాగా, ఐపీఎల్-17లో డిఫెండింగ్ చాంపియన్ అయిన చెన్నయ్ ప్లే ఆఫ్స్ పోటీలో ఉంది. 10 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో ఆ జట్టు ఐదో స్థానంలో ఉన్నది. ఈ నెల 5న కీలక మ్యాచ్‌‌లో పంజాబ్‌ను ఎదుర్కోనుంది. 

Tags:    

Similar News