రోహిత్, కోహ్లీ వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఐపీఎల్ చైర్మన్?

గత సీజన్ నుంచి ఐపీఎల్‌లో అమలు చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ఈ సీజన్‌లో తీవ్ర చర్చ జరుగుతుంది.

Update: 2024-05-25 12:59 GMT

దిశ, స్పోర్ట్స్ : గత సీజన్ నుంచి ఐపీఎల్‌లో అమలు చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ఈ సీజన్‌లో తీవ్ర చర్చ జరుగుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాలాంటి స్టార్ ఆటగాళ్లు ఈ రూల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రూల్ వల్ల ఆల్‌రౌండర్లకు నష్టం జరుగుతుందని రోహిత్ వ్యాఖ్యానించగా.. గేమ్ సమతుల్యత దెబ్బతింటుందని కోహ్లీ చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై విమర్శల నేపథ్యంలో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ దీనిపై స్పందించారు.

తాజాగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆల్‌రౌండర్లను తయారు చేసే బాధ్యత కేవలం ఐపీఎల్‌పైనే ఉందా? అని ప్రశ్నించారు. ‘బీసీసీఐ ఏడాదికి 2 వేలకుపైగా మ్యాచ్‌లను నిర్వహిస్తుంది. ఆటగాళ్లు అందులో ప్రతిభ చాటే అవకాశాలను పొందుతున్నారు. విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, అండర్-16, అండర్-19 ఇలా చాలా టోర్నీలు ఉన్నాయి.’అని తెలిపారు. ఈ రూల్ కొనసాగించాలా?లేదా? అనే విషయంపై వాటాదారులతో మాట్లాడుతామని, టోర్నమెంట్‌కు ఏది మంచిదో అదే చేస్తామన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన శాశ్వతమైనది కాదని, ఈ సీజన్‌ తర్వాత సమీక్షిస్తామని బీసీసీఐ సెక్రెటరీ జై షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News