కలవరపెడుతున్న కల్తీ కల్లు..అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న వైనం

నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పొద్దున్నే ఛాయ్ తాగినట్టుగా చాలా మంది కల్లు తాగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Update: 2024-05-22 14:36 GMT

దిశ,మడకశిర: నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పొద్దున్నే ఛాయ్ తాగినట్టుగా చాలా మంది కల్లు తాగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కల్తీ కల్లు విక్రయిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొంతమంది వ్యాపారులు, కార్మికులు, కూలీల కడుపులు కొడుతూ అడ్డంగా సంపాదిస్తున్నారు. వింత మత్తుకు అలవాటు చేసి వారి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. ఒళ్ళు గుల్ల చేసి ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నారు. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో కేసుల నుంచి తప్పించుకొని దర్జాగా తిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా ఏ నాయకుడు పట్టించుకోడు. ఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కల్తీ కల్లు తాగి పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తూ దాదాపు అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారు.

వచ్చేది కొంత.. తయారయ్యేది కొండంత

వ్యాపారులు మత్తు కోసం ఇందులో రకరకాల రసాయనాలు కలుపుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. 10 లీటర్ల స్వచ్చమైన కల్లుకు 150 లీటర్ల నీళ్లు, మత్తు కోసం ఆల్రో జోలం, డైజోఫాం, క్లోరో హైడ్ తదితర నిషేధిత మత్తు రసాయనాలు కలుపుతున్నారు. 5 శాతం మేర మాత్రమే స్వచ్ఛమైన కల్లు విక్రయిస్తున్నారు. మిగిలిన 95 శాతం కల్తీనే. అంతేకాకుండా అమ్మోనియం మిశ్రమ రసాయనాలు, సోడాయాష్, కుంకుడుకాయ రసం వాడుతున్నారు. దీనివల్ల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కళ్లు పోవడం, మెదడు సరిగా పని చేయకపోవడం, ఙ్ఞాపక శక్తి తగ్గిపోవడం, మూత్ర పిండాల వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ప్రాంతాలు సైతం పోతున్న ఘటనలు సంభవిస్తున్నాయి.

కల్లుగీత కార్మికులకు లైసెన్స్ ఇవ్వాలి. అయితే కొంత మంది పలుకుబడిని ఉపయోగించే లైసెన్స్ తీసుకొని ఇతర వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. దీంతో ఆ వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఓ కల్లు దుకాణం లైసెన్స్ దారులందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటారు. వారు ఈత చెట్ల ద్వారా తెచ్చే స్వచ్ఛమైన కల్లును విక్రయించాలి. కానీ వారంతా ఓ గుత్తేదారుడు ఎన్నుకొని, అతని వద్ద ఇంతో అంతా ఆ వ్యాపారికి మద్యం ప్రియులకు అవసరమైన కల్లు లేకపోవడంతో కల్తీకి అలవాటు చేస్తున్నారు. ఓ పంచాయితీకి లైసెన్స్ తీసుకొని నాలుగైదు కల్లుడు కాణాలు నిర్వహిస్తున్నారు. ఆల్ఫాజోలం, క్లోరో హైడ్రేడ్ తదితర వంటి మత్తు పదార్థాలు కలుపుతూ ప్రజలకు కిక్కు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్కరోజు తాగకపోయినా వారు పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తుంటారు.

గతంలో ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంది. మత్తులో జోగుతున్న ఎక్సైజ్ శాఖ.. మడకశిర నియోజకవర్గంలో కల్తీకల్లు ఏరులైపారుతోంది. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో గుప్పుమంటోంది. విచ్చల విడిగా కల్లు దుకాణాలు పెరిగిపోవడంతో జనం మత్తులో మునిగి తేలుతున్నారు. ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల కల్తీకల్లు ప్రాణాలు తీస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కల్లును కల్తీ చేసి యదేచ్చగా విక్రయాలు జరుపుతున్నా అబ్బే అదేం లేదంటున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు, కల్తీ కల్లు సేవించి ఎంతో మంది అనారోగ్యానికి గురై మరణించిన పట్టించుకోవడం లేదు. మరోవైపు రాజకీయ పలుకుబడితో అధికారులు వారి జోలికి వెళ్లడం లేదు. దీంతో కల్తీ కల్లు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. మామూళ్ల మత్తులో జోగుతున్న ఎక్సైజ్ అధికారులు ఇప్పటికైనా గ్రామాల్లో కల్తీ కల్లు అమ్మకాలపై నిఘా పెట్టాలని స్థానికులు పేర్కొంటున్నారు.

Similar News