బీఆర్ఎస్ నేత కుమారుడి నిర్వాకం...పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి మోసం

ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని ఓ బీ ఆర్ ఎస్ నేత కుమారుడు లొంగ తీసుకొని గర్భవతిని చేశాడు.

Update: 2024-05-23 12:13 GMT

దిశ, ఖమ్మం రూరల్ : ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని ఓ బీ ఆర్ ఎస్ నేత కుమారుడు లొంగ తీసుకొని గర్భవతిని చేశాడు. సదరు యువతి పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో తల్లిదండ్రులతో కలిసి బలవంతంగా గర్భవిచ్ఛిన్నం చేశారు. ఈ దారుణమైన ఘటనపై ఖమ్మం రూరల్ మండల పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదు అవ్వడంతో వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం రూరల్ మండలంలోని కామంచికల్లు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత బొప్పి ప్రభాకర్ కుమారుడు బొప్పి సంజయ్ ఓ యువతితో గత కొంతకాలంగా ప్రేమాయనం నడిపిస్తున్నాడు. అంతేకాకుండా

    ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లొంగ తీసుకుని గర్భవతిని చేశాడు. అనంతరం సదరు యువతి సంజయ్ ని పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిలదీసింది. దీంతో అతను తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కూడా పెళ్లి చేస్తామని చెప్పారు. కానీ పెళ్లి జరగాలంటే గర్భం ఉంటే కుదరదని, దాన్ని తీపించుకుంటేనే సాధ్యమవుతుందని తల్లిదండ్రుల ప్రోద్బలంతో నమ్మించాడు. వారి మాటలతో ఆ యువతి వారు ఇచ్చిన టాబ్లెట్లు వేసుకొని గర్భ విచ్చిన్నం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు ఏం జరిగిందని యువతిని గట్టిగా మందలించారు. కాగా జరిగిన విషయం మొత్తం వారికి ఆ యువతి చెప్పడంతో యువకుడి తండ్రి బొప్పి ప్రభాకర్​ ను ఆయన కుమారుడితో వివాహం చేయాలని కోరారు. దాంతో మీ అమ్మాయితో మాకు ఎటువంటి సంబంధం లేదని బెదిరిస్తూ వారిపైనే దాడికి యత్నించాడు. దీంతో తాము మోసపోయామని గుర్తించి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాణాపాయ స్థితిలో యువతి...

గర్భవిచ్ఛిన్నం చేసుకున్న యువతి ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుంది. వారి మాటలు నమ్మి వేసుకున్న టాబ్లెట్లు ఆ యువతి ప్రాణం మీదికి తీసుకువచ్చాయి. ఆ టాబ్లెట్లు వేసుకున్నప్పటి నుంచి బ్లీడింగ్ అవుతున్నప్పటికీ తల్లిదండ్రులకు చెప్పకుండా అంతే ఓర్చుకుంది. ఈ తతంగం పోలీస్ స్టేషన్​కు చేరి ఆసుపత్రికి వెళ్లిన యువతిని పరీక్షించిన వైద్యులే ఆశ్చర్యపోయారు. మరో రోజు ఆలస్యం అయి ఉంటే ప్రాణాలే పోయి ఉండేవి అని చెప్పడం ఆ యువతి పరిస్థితిని స్పష్టం చేస్తుంది. నిందితులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యువకుడు, తల్లిదండ్రులు, సోదరుడిపై కేసు నమోదు

తప్పు చేసిన కుమారుడికి బుద్ధి చెప్పి యువతికి న్యాయం చేయాల్సిన తల్లిదండ్రులు, అతని సోదరుడు వత్తాసు పలకడంతో వారిపై కూడా కేసు నమోదు అయింది. బొప్పి సంజయ్, బొప్పి ప్రభాకర్( తండ్రి), బొప్పి దేవమని( తల్లి ), బొప్పి అజయ్( సోదరుడు) పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అత్యాచారానికి పాల్పడిన బొప్పి సంజయ్​ను రిమాండ్​కు తరలించడంతోపాటు పోలీసులు విచారణ చేపట్టారు.  

Similar News